BCCI Secretary Jay Shah: బీసీసీఐలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కుమారుడు జైషా తనదైన మార్కు చూపుతున్నారు. ఆయన బీసీసీఐలోకి అడుగుపెట్టాక అనూహ్య మార్పులు జరుగుతున్న విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం గంగూలీతోపాటు బీసీసీఐ కార్యవర్గంలో చేరిన షా.. నాటి నుంచే చక్రం తిప్పడం ప్రారంభించారు. 2020లో బోర్డు కార్యదర్శిగా ఎన్నికైన జైషా.. తనకున్న రాజకీయ అండదండలతో బీసీసీఐని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకోవడంతోపాటు బోర్డు కీలక నిర్ణయాల్లో తన మార్కు ఉండేలా అధ్యక్షుడు(గంగూలీ) సహా సభ్యులందరినీ తన గుప్పిట్లో పెట్టుకున్నాడు.

రవిశాస్త్రి, కోహ్లికి చెక్..
షా బాధ్యతలు చేపట్టడానికి ముందు బీసీసీఐలో నాటి టీమిండియా కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లి హవా కొనసాగేది. బోర్డు ప్రతీ నిర్ణయంలో వీరి పాత్ర కీలకంగా ఉండేది. అయితే షా ఎంట్రీతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బోర్డు కీలక నిర్ణయాల్లో రవిశాస్త్రి, కోహ్లిల ప్రమేయాన్ని సహించని షా.. వారిద్దరికీ చెక్ పెట్టడం ప్రారంభించాడు. క్రమంగా వారిని బాధ్యతలకు దూరం చేశాడు. ఇందుకు గంగూలీని పావుగా వాడుకున్న షా.. కోహ్లిని కెప్టెన్సీ నుంచి తప్పించడానికి బీసీసీఐ బాస్‌కు కెప్టెన్‌ను మధ్య ఉన్న విభేదాలే కారణమని అందరూ నమ్మేలా వాతావరణాన్ని క్రియేట్ చేశాడు. రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడంలోనూ చక్రం తిప్పి బీసీసీఐపై తన మార్కును మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.
గంగూలీతో విభేదాలకు బీజం అక్కడే..
ఆతర్వాత కొన్ని రోజుల వరకు అన్నీ బాగానే జరిగినప్పటికీ.. గంగూలీ బెంగాల్ రాజకీయాలకు నో చెప్పడం, రెండోసారి బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టాలని కోరుకోవడం షాకు నచ్చలేదు. వీరిద్దరి మధ్య బయటకు కనిపించని విభేదాలకు ఇక్కడే బీజం పడింది. గంగూలీని ఐసీసీ అధ్యక్ష పదవి బరిలో నిలిపి, తాను బీసీసీఐ బాస్ అవ్వాలని భావించిన షా.. గంగూలీ తిరగబడటంతో ప్లాన్–బిని అమలు చేసి, తన కంట్రోల్‌లో ఉండే రోజర్ బిన్నీ పేరును ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా తెరపైకి తెచ్చాడు. ఇందుకోసం అన్ని రాష్ట్రాల బోర్డు పెద్దలను ఒప్పించి బీసీసీఐ బాస్‌గా బిన్నీకి పట్టం కట్టాడు. షా ఉద్దేశం బయటపడటంతో అప్పటి దాకా ఐసీసీ బరిలో నిలవాలని భావించిన గంగూలీ ఆ రేసు నుంచి కూడా తప్పుకున్నాడు.
ఇప్పుడు రోహిత్ వంతు..
ఇదంతా ఒక ఎపిసోడ్ అయితే, తాజాగా చేతన్‌శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీని సమాచారం కూడా లేకుండా అవమానకర రీతిలో తప్పించాడు. టీ20ల్లో వైఫల్యాలను సాకుగా చూపి రోహిత్ శర్మ కెప్టెన్సీకి ఎసరు పెట్టడం వంటి కీలక పరిణామాలు చకచకా జరిపోయాయి. జట్టు ఎంపికలో తన అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదని, బీసీసీఐ కొత్త బాస్ బిన్నీతో సెలెక్టర్లపై వేటు వేయించిన షా.. పనిలో పనిగా మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు అనే అంశాన్ని తెరపైకి తెచ్చి తన రాష్ట్రానికి చెందిన హార్ధిక్ పాండ్యాకు టీ20 కెప్టెన్సీ పగ్గాలు కట్టపెట్టేందుకు రంగం సిద్ధం చేశాడు. అతి త్వరలో టీమిండియాలో భారీ మార్పులు చేయబోతున్నట్లు హింట్ ఇచ్చాడు. తనకు నచ్చని, తన మాట వినని సీనియర్లపై నిర్ధాక్షిణ్యంగా వేటు వేసేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేశాడని సమాచారం.

హార్ధిక్‌కు ప్రమోషన్..
గత సీజన్‌లో గుజరాత్‌కు సంబంధించిన ఫ్రాంచైజీ ఐపీఎల్ అరంగేట్రం చేయడం, గుజరాత్‌కు చెందిన ఆటగాడే ఆ జట్టు కెప్టెన్ (హార్ధిక్) కావడం, ఏమాత్రం అంచనాలు లేని ఆ జట్టే చాంపియన్ కావడం, దీని ఆధారంగా పెద్దగా అనుభవం లేని హార్ధిక్‌ను టీమిండియా కెప్టెన్‌గా ప్రమోట్ చేస్తుండటం.. ఇవన్నీ అలా జరిగిపోయాయి/పోతున్నాయి. ఈ మొత్తం తంతులో షా పాత్ర ఉందని క్రికెట్ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ బహిరంగంగా చర్చించుకుంటున్నారు.
బీసీసీఐపై ఉన్న పట్టును సహించలేక కోచ్ రవిశాస్త్రిని, వైఖరి నచ్చక కోహ్లిని, రాజకీయ కారణాలతో గంగూలీని, వైఫల్యాలను సాకుగా చూపి రోహిత్‌ను పదవులకు దూరం చేసిన షా.. ప్రస్తుతం హార్ధిక్‌ను టీమిండియా కెప్టెన్‌గా ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.