Growth Mindset: జీవితంలో చురుకుదనం ఉండాలి. ఉత్సాహం ఉండాలి. అన్నింటికీ మించి కొత్తదనం ఉండాలి. కొత్తదనం లేకపోతే మనిషి జీవితంలో ఆనందం ఉండదు. సంతోషం కనిపించదు.. నిరాశ, నిస్పృహ మాత్రమే దర్శనమిస్తుంటాయి.. ఇలాంటి చోట జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు.
మనలో చాలామందికి టమాట కూర అంటే చాలా ఇష్టం. అలాగని చెప్పి రోజు టమాటా కూర తినడం సాధ్యం కాదు. ఒకరోజు టమాటా తింటాం. మరొక రోజు కష్టమైనప్పటికీ కాకరకాయ తినేస్తాం. ఇంకొక రోజు బీరకాయ.. ఇలా తినే తిండిలోనే మనం ఈ స్థాయిలో వైవిధ్యాన్ని చూపించినప్పుడు.. జీవితంలో మాత్రం ఎందుకు చూపించకూడదు? అలా చూపించకపోతే అది జీవితం ఎలా అవుతుంది.
జీవితంలో కొత్తదనం అనేది కచ్చితంగా ఉండాలి. అప్పుడే మనకు సవాళ్లు ఎదురవుతాయి. సమస్యలు స్వాగతం పలుకుతాయి. అదే సమయంలో సవాళ్లకు ప్రతి సవాళ్లను మన మెదడు ఆలోచిస్తుంది. సమస్యలకు పరిష్కారాన్ని కనిపెడుతుంది. ఫలితంగా ఒక్కో మెట్టు ఎదిగేలా మన మెదడు తర్ఫీదు ఇస్తూ ఉంటుంది. సమస్య ఎదురైనప్పుడు.. సవాల్ కష్ట పెట్టినప్పుడు.. మన మెదడు చురుకుగా పనిచేస్తుంది. కొత్తదనం మన ఆలోచనలో నిండి ఉంటుంది కాబట్టి.. ఎలాంటి అడుగులైనా వేయవచ్చు. ఎక్కడి దాకా అయినా ప్రయాణం సాగించవచ్చు. ప్రస్తుతం ఉన్న స్థాయిలో ఉన్న వ్యక్తులు.. రాజకీయ నాయకులు ఇలా ఇబ్బందిపడిన వారే. కాకపోతే వారు కొత్తదనాన్ని నిత్యం కోరుకున్నారు. అందువల్ల ఈ స్థాయిలో ఉన్నారు.
కొత్తదనం కోసం పెద్ద పెద్ద స్థాయి వ్యక్తులు మాత్రమే కాదు.. దిగువ స్థాయి మనుషులు కూడా తపిస్తుంటారు.. అటువంటి వారిలో ఈ వంట మనిషి ముందు వరుసలో ఉంటుంది. రోజు చేసేది వంటే అయినప్పటికీ.. ఆమె కొత్తదనం కోరుకున్నది. ఇందుకు కారణం లేకపోలేదు.. స్వప్నిల్ అనే ఫిట్నెస్ ట్రైనర్ ఇంట్లో ఓ వంట మనిషి పని చేస్తూ ఉంటుంది. ఇటీవల స్వప్నిల్ తన డైట్ కోసం రోజూ ఒకే రకమైన వంటలు చేయాలని ఆదేశించాడు. అతను చెప్పినట్టుగా రెండు నెలలపాటు ఆమె అదే రకమైన వంటలు చేసింది. అయితే రోజు ఒకే వంట ఉండడంతో ఆమె కొత్త వాటిని నేర్చుకునే అవకాశం లేకుండా పోయింది. పైగా ఉన్న వంటలను మర్చిపోయే స్థాయికి దిగజారింది. దీంతో వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. గ్రోత్ లేని చోట ఉండకూడదని ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. ఆ పనిమనిషి తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది.