France vs Morocco 2022: ఒక జట్టు సంచలనాలకు మారుపేరు. మరో జుట్టు డిపెండింగ్ ఛాంపియన్. మొత్తానికి ఫిఫా కప్ చివరి అంకానికి చేరుకుంది. బుధవారం రాత్రి జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో మొరాకో, ఫ్రాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో ఫ్రాన్స్ జట్టు హాట్ ఫేవరేట్ గా కనిపిస్తున్నా…మొరాకో ను తక్కువ చేసి చూడటానికి లేదు. లీగ్ దశలో వరల్డ్ నంబర్ 2 ర్యాంకు జట్టు బెల్జియానికి షాక్ ఇచ్చిన మొరాకో.. రౌండ్ 16 లో మాజీ ఛాంపియన్ స్పెయిన్ ను షూట్ అవుట్ చేసింది. ఇక క్వార్టర్స్ లో బలమైన పోర్చుగల్ ను ఓడించింది. తొలిసారి సెమీస్ కు చేరింది. ఇదే జోరుతో ఫైనల్ చేరాలి అనే పట్టుదలతో ఉంది.. సమష్టిగా ప్రత్యర్థి గోల్ పోస్టులపై దాడులు చేయడం మొరాకో ప్రత్యేకత. హాకీమి జియేష్, సోపియానే బౌఫాల్, యూసఫ్ నేసిరో ఫార్వర్డ్ విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు.. మొరాకో జట్టులో స్టార్ ఆటగాడు అచారఫ్ హాకీమి ఉండనే ఉన్నాడు.

ఫ్రాన్స్ ఎలా ఎదుర్కొంటుందో
ఫ్రాన్స్ టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన జట్టు.. అయితే ఇప్పటివరకు ప్రత్యర్థి ఆటగాడికి గోల్ చేసే అవకాశం ఇవ్వని మొరాకో ను ఎదుర్కోవడం ఒకరకంగా సవాలే. వరుసగా రెండోసారి సెమిస్ చేరిన ఫ్రెంచ్ టీం చివరి లీగ్ మ్యాచ్ లో ట్యునిషియా చేతిలో ఓడిపోయింది. అయినప్పటికీ నాకౌట్ బెర్త్ సాధించింది.. ఇక ప్రీ క్వార్టర్స్ లో పోలెండ్ ను చిత్తు చేసిన ఫ్రాన్స్.. క్వార్టర్స్ లో బలమైన ఇంగ్లాండ్ ను ఓడించి ఆత్మవిశ్వాసంతో ఉంది. స్ట్రైకర్లు ఎంబప్పే, గిరోర్డ్ మంచి ఫామ్ లో ఉండడం ఆ జట్టుకు శుభపరిణామం. కాగా అనుభవజ్ఞుడైన గ్రీజ్ మెన్ చక్కని అవకాశాలు సృష్టిస్తున్నాడు. మొత్తానికి మొరాకో డిఫెన్స్, ఫ్రాన్స్ అటాకింగ్ కు ఖతార్ వేదికగా అసలైన పోటీ జరగనుంది. కానీ ఫ్రాన్స్ డిపెండింగ్ ఛాంపియన్ కావడంతో ఒత్తిడి మొత్తం ఆ జట్టు మీదనే ఉంది.

మిగతా విషయాలు కూడా
బెల్జియం, క్రొయేషియా, స్పెయిన్, పోర్చుగల్ లాంటి ఫుట్ బాల్ పవర్ హౌస్ జట్లలో ఒక్కటి కూడా మొరకోజట్టుపై ఒక్క గోల్ కూడా చేయలేకపోవడం విశేషం.. కెనడా తో మ్యాచ్ లో మాత్రం ఓన్ గోల్ నమోదయింది. ప్రపంచ కప్ లో మొరాకోతో ఫ్రాన్స్ తలపడటం ఇదే మొదటిసారి. ప్రపంచ కప్ సెమీస్ లో ఆడడం ఫ్రాన్స్ జట్టుకు ఇది ఏడోసారి.. గతంలో 1958, 1982, 1986ల్లో జరిగిన టోర్నీల్లో సెమీస్ లో ఫ్రెంచ్ టీం వెనుతిరగగా.. 1998, 2006, 2018లో ఫైనల్ చేరింది. ఇక ఈ సెమీఫైనల్ మ్యాచ్లో సాంస్కృతిక, రాజకీయ అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. మొరాకో 1912 నుంచి 1956 వరకు ఫ్రెంచ్ పాలనలో ఉంది. దీంతో ఫ్రాన్స్ పై విజయాన్ని మొరాకో ఆటగాళ్లు చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు.. చాలామంది దృష్టిలో ఈ మ్యాచ్లో ఫ్రాన్స్ తిరుగులేని ఫేవరెట్. అయితే ఈ ప్రపంచకప్ లో మొరాకో అన్ని అంచనాలను మించిపోయింది. ప్రపంచ కప్ 92 ఏళ్ల చరిత్రలో ఈసారి మొరాకో చేసిన ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచిపోతుంది. “ఐరోపా జట్లు ప్రపంచ కప్ ఫేవరేట్లు. కానీ మేము అగ్ర జట్లతో ఆడి ఇక్కడిదాకా వచ్చాం. మమ్మల్ని అంత తేలిగ్గా తీసి పడేయొద్దు. మాతో ఆడబోయే జట్టు ఏదైనా మమ్మల్ని చూసి భయపడుతుంది” అని మొరాకో ఆటగాళ్లు అంటున్నారంటే వాళ్ల లక్ష్యం ఏమిటో స్పష్టంగానే కనిపిస్తోంది.