Employees Termination: 2008.. ఈ సంవత్సరం పేరు చెబితే బడా కార్పొరేట్ సంస్థలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉద్యోగులు వణికి పోతారు.. ఆ దరిద్రపుగొట్టు సంవత్సరం పేరు ఎందుకు గుర్తు చేస్తారని మండిపడతారు. ఎక్కడికక్కడ ఉద్యోగాలు ఊడిపోయాయి. అప్పట్లో పెద్ద పెద్ద కంపెనీలు మూతపడ్డాయి. ఉపాధి లేక ఎంతోమంది రోడ్డున పడ్డారు. ఈఎంఐలు కట్టలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. నవీన యుగంలో డెత్ ఇయర్ అని 2008కి పేరు ఉంది. 14 ఏళ్ళు గడిచిన తర్వాత ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోంది. రెండేళ్లపాటు కకావికలం చేసిన కోవిడ్.. ఆ తర్వాత రష్యా, ఉక్రేయిన్ యుద్ధం, ఇప్పుడు ఆర్థిక మాంద్యం.. వెరసి ఇప్పుడు ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. కొలువులన్నీ సంక్షోభంలో కోల్పోయాయి. కోవిడ్ కారణంగా అమెరికాను కమ్మేస్తున్న ఆర్థిక మాంద్యం దెబ్బను కాచుకునేందుకు అమెరికన్ ఫెడరల్ బ్యాంకు రంగం లోకి దిగింది.. తాను ఇచ్చే రుణాలపై ఫెడరల్ ఫండ్ రేట్ అమాంతం పెంచింది. దీంతో బ్యాంకులన్నీ ఆ భారాన్ని వినియోగదారులపై వేశాయి.. వ్యక్తులకు, కంపెనీలకు తాము ఇస్తున్న రుణాలపై వడ్డీరేట్లు పెంచేశాయి.. ఈ భారాన్ని తట్టుకునేందుకు ఉత్పత్తి ఆధారిత సంస్థలైన మెటా, సీ గేట్, మైక్రో సాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే విధానంపై దృష్టి పెట్టాయి. అందులో భాగంగానే ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

మెటా లో 11 వేల మంది
ఫేస్బుక్ మాతృ సంస్థ అయిన మెటా కంపెనీ 11 వేలమందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఇందులో దాదాపు 1000 మంది భారతీయులు ఉన్నారు.. వారిలో 400 మంది భారతదేశంలో పనిచేసేవారే. ఒక హార్డ్ డిస్క్ లను తయారు చేసే సి గేట్ టెక్నాలజీ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా తన ఉద్యోగుల్లో 3,000 మందిని తొలగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా ఖర్చుల నియంత్రణలో భాగంగా 10,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమైంది. ఇక అమెజాన్ తొలగించే ఉద్యోగుల శాతం లో అధికంగా భారతీయులు ఉన్నారు..వాల్ డిస్నీ, నెట్ ఫ్లిక్స్ వంటి సంస్థలు ఉద్యోగుల కోతలను ప్రారంభించాయి.. ఈ ఉద్వాసనల ఫలితం భారతీయుల మీదే ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తోంది.. ఆయా కంపెనీల వీసాలపై అమెరికా, ఇతర దేశాలకు వెళ్లిన భారతీయులు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అమెరికాలో హెచ్_1 బి వీసా పై ఉద్యోగం చేసే వారిని కంపెనీ తొలగిస్తే వారు 60 రోజుల్లోగా మరో సంస్థలో ఉద్యోగం చూసుకోవాలి. లేదా స్వదేశానికి వెళ్ళిపోవాలి.
మస్క్ మామది మరో కథ
ట్విట్టర్ ను 4, 400 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసిన ఎలన్ మస్క్.. పొదుపునియత్రణ చర్యలు పాటిస్తున్నాడు. బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులకు వడ్డీ భారం అధికం కావడంతో దానిని తగ్గించుకునేందుకు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాడు.ఈ కార్యక్రమాన్ని అతడు ఒక ఉద్యమం లాగా చేపడుతున్నాడు. ట్విట్టర్ ఉద్యోగుల్లో 50 శాతం మంది అంటే 3,700 మంది ఉద్యోగులను ఒకేసారి తీసి అవతల పడేసాడు. ఇందులో భారతీయులు గణనీయంగా ఉన్నారు.. టెస్లా కంపెనీ రాకకు భారత ప్రభుత్వం కఠిన ఆంక్షలు పెడుతుందన్న కోపమో, మరి ఏమిటో తెలియదు గానీ ట్విట్టర్ సంస్థకు భారత్ లో ఉన్న మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ విభాగాలను మస్క్ పూర్తిగా తొలగించేశాడు.. ఆ రెండు విభాగాల్లో 230 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, 180 మందికి ఉద్వాసన పలికాడు. మిగతా వారిని వేరే విభాగాల్లోకి పంపించాడు. ఇక 5,500 మంది కాంట్రాక్టు ఉద్యోగుల్లో 4,400 మందిని తొలగించాడు. ఈ పరిణామాల వల్ల ఎక్కువగా నష్టపోయింది భారతీయులే.

12,000 ఉంది అవుట్
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్న కంపెనీలు అన్నీ కూడా ఉత్పత్తి ఆధారంగా ఉన్నవే.. సేవల ఆధారిత కంపెనీల్లో.. అందునా భారతదేశానికి చెందిన సర్వీస్ బేస్డ్ కంపెనీల్లో కోతలు తక్కువగా ఉన్నాయి.. ఉత్పత్తి ఆధారిత సేవలు అందించే అమెరికన్ కంపెనీలో టాప్ 5 ఫేస్బుక్, యాపిల్, అమెజాన్, నెట్ ఫ్లిక్స్, గూగుల్.. ఈ ఐదింటిని కలిపి ఫాంగ్(ఎఫ్ ఏఏ ఎన్ జీ) కంపెనీలుగా పిలుస్తారు.. మనదేశంలో సేవలు అందించే ఐదు సర్వీస్ బేస్డ్ కంపెనీలు విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, టిసిఎస్, హెచ్ సి ఎల్ వీటి మొత్తాన్ని విచ్(డబ్ల్యూ ఐ టి సి హెచ్) గా పిలుస్తారు. అయితే వీటిలో ఒక్క కాగ్నిజెంటు ఒకటే అమెరికన్ సంస్థ. ఈ ఒక్క సంస్థ ఇటీవల కాలంలో బ్యాక్ గ్రౌండ్ చెక్ సరిగా చేయలేదు అని నెపంతో, ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించారన్న కారణంతో భారతదేశంలో 12,000 మంది ఉద్యోగులను తొలగించింది.
కష్టకాలంలో జాగ్వార్ ముందుకు వచ్చింది
ఉద్యోగాలు కోల్పోతున్న టెకీల కు చేయూత అందించేందుకు వందేళ్ల చరిత్ర ఉన్న జాగ్వార్ ల్యాండ్ రోవర్ సంస్థ ముందుకు వచ్చింది. ఇది బ్రిటిష్ ఆటోమేటిక్ సంస్థ అయినప్పటికీ.. దీనిని టాటా కంపెనీలు సొంతం చేసుకున్నాయి. తాజా సంక్షోభం నేపథ్యంలో.. సెల్ఫ్ డ్రైవింగ్, ఎలక్ట్రిఫికేషన్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ విభాగాలకు చెందిన 800 ఉద్యోగాలు తమ సంస్థలో ఖాళీగా ఉన్నాయని, వాటిని ఉద్యోగాలు కోల్పోయిన టెకీలకు ఇస్తామని ప్రకటించింది. ఇలా కొన్ని కంపెనీలు ముందుకు వస్తే ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఎంతో కొంత ఉపయోగంగా ఉంటుంది.