Husband And Wife Relationship: నమ్మకమనే ఇరుసు మీదే ప్రపంచం అనే చక్రం నడుస్తోంది. మనం ఏ పనిచేయాలన్నా ఎవరినైనా నమ్మాల్సిందే. మనకు నమ్మకస్తులు కొందరు ఉంటారు. వారు మన విధేయులుగా ఉంటారు. మన మీద మాట కూడా పడనివ్వరు. ఎవరైనా హేళన చేస్తే ఊరుకోరు. నలుగురిలో మనల్ని చులకన చేస్తే బాధ పడతారు. మన మీద ఈగ కూడా వాలనివ్వరు. అంతటి నమ్మకం ఉంటుంది. ఇటీవల కాలంలో నమ్మకస్తులు కానరావడం లేదు. ఏదో మీది మాటలకే కానీ లోపల మన మీద ఈర్ష్యా ద్వేషాలతోనే ఉంటున్నారు. దీంతో నిజమైన విశ్వాసపాత్రులు కానరావడం లేదు. ఫలితంగా మన మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు ఉంటున్నాయి.

ఒక వ్యక్తిని నమ్మే స్థితిలో అతడు చేసే పనులకు ఫిదా అయిపోయి అభిమానులుగా మారే వారుంటారు. జీవిత భాగస్వామి కూడా మనల్ని గుడ్డిగా నమ్ముతుందా లేక మన పనితీరుతో మనల్ని ప్రేమిస్తుందా తెలుసుకోవాలంటే కొన్ని పరీక్షలు తప్పనిసరి. దీర్ఘకాలిక సంబంధాల కొనసాగింపులో నమ్మకాలే పునాది. లేకపోతే మన జీవితానికి సార్థకత ఉండదు. సంబంధాల బంధంలో మన భవిష్యత్ ఆధారపడి ఉంటుందనేది నిజమే. ఈనేపథ్యంలో జీవిత భాగస్వామితో మనకున్న సంబంధం ఎలాంటిది? ఎలా కొనసాగుతుందనే విషయాల మీదే నడుస్తుంది.
మనల్ని నిజంగా అభిమానించే వారు మన మీద మాట పడనివ్వరు. మన మాటలను గౌరవిస్తారు. మన గురించి వచ్చే పుకార్లను కూడా అడ్డుకుంటారు. అనవసరంగా పుకార్లు సృష్టించే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. లేనిపోని నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోరు. మన విధానాలను తప్పుడు కావని వాదిస్తుంటారు. మనపై వచ్చే గాసిప్స్ ను నమ్మరు. ఏ విషయంలోనైనా స్పష్టత ఉంటేనే విశ్వసిస్తారు. లేదంటే వాటిని తిప్పికొట్టి అలా మాట్లాడే వారికి తగిన గుణపాఠం చెబుతారు.

మీ భాగస్వామికి మీపై నమ్మకం ఉంటే చెడు సందర్భాల్లోనూ మీ వెంటే ఉంటారు. మీకు అండగా నిలబడి ఎల్లప్పుడు మీకు సహాయం చేస్తారు. మంచి విషయాల్లోనూ సలహాలు, సూచనలు ఇస్తుంటారు. ఒత్తిడి, ఆందోళనలు పెరిగే సందర్భంలో మనకు సరైన దిశా నిర్దేశం చేస్తారు. మన ఉన్నతిలో మన వెంటే ఉంటూ మనకు చేదోడు వాదోడుగా నిలుస్తారు. ఒకరిపై మరొకరికి గౌరవం ఉండటం అంటే వారు లేకున్నా వారిపై నిందలు వేసే వారిని సహించరు. తమ భాగస్వామిని విమర్శించే వారికి అడ్డుగా నిలుస్తారు.
సంబంధాలు అవగాహన, నమ్మకం, వాగ్దానాలపై ఆధారపడతాయి. ఇచ్చిన మాటలను నిలబెట్టుకునే క్రమంలో మన నిబద్ధత తెలియజేస్తుంది. అందుకే మనం ఏదైనా వాగ్దానం చేస్తే దాన్ని నెరవేర్చడానికి తగిన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేదంటే మన మాటలను ఎవరు నమ్మకుండా పోతారు. మాట నిలబెట్టుకోవడంలో కూడా మన సంబంధాలు నిలబడతాయి. కృషి, పట్టుదల, శ్రద్ధ ఇవన్ని మన విధేయతను తెలియజేస్తాయి. మన మీద ఉన్న నమ్మకాన్ని ప్రదర్శించడంలో సాయపడుతుంది.
ఇంకా రహస్యాలు దాచుకోవద్దు. నిజాయితీతో వ్యవహరించాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ముఖ్యమైన విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి వాటిని నిర్లక్ష్యం చేయరాదు. క్షమాగుణం ఉంటే మంచిది. సంబంధ బాంధవ్యాలపై నిర్ణయాలు తీసుకోవడంలో ఒకరికొకరు అంకితభావం కలిగి ఉంటే ఫలితం ఇంకా ఎక్కువ వస్తుందనడంలో సందేహం లేదు.