
Amaravati: ఏపీ రాజధాని అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే రైతులతో పాటు అన్ని రాజకీయ పక్షాలూ అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని పోరాడుతున్నాయి. అందులో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం స్టాండ్ ఇదే తీసుకుంది. రైతులు సైతం న్యాయపోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం దీనిపై అత్యున్నత న్యాయస్థానంలో విచారణ సైతం జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అమరావతికి నిధులు కేటాయించింది. దీంతోఇదో ప్రాధాన్యతాంశంగా మారింది. ఇదో సానుకూలాంశంగా అమరావతి రైతులు భావిస్తున్నారు. న్యాయపోరాటంలో సైతం తామే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర నిర్మాణాలకు నిధులు…
అమరావతి రాజధాని కొనసాగింపుపై వివాదం కొనసాగుతోంది. పాలనా వికేంద్రీకరణకు మూడు రాజధానులు తప్పనిసరి అని వైసీపీ సర్కారు చెబుతోంది. అమరావతిని శాసన రాజధానికే పరిమితం చేస్తూ.. విశాఖలో పాలనా రాజధాని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటుతో మూడు ప్రాంతాలకు సమ ప్రాధాన్యం దక్కుతుందని భావిస్తోంది. అయితే అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలంటూ స్థానిక రైతులు, జేఏసీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఏపీ హైకోర్టులో అమరావతికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీని పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంలో అప్పీల్ కు వెళ్లింది. ప్రస్తుతం ఆ కేసు విచారణ దశలో ఉంది. ఇదే సమయంలో అమరావతిలో కేంద్ర నిర్మాణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపు చేసింది. అయితే ఇక్కడే ఒక ట్విస్టు. అమరావతితో పాటు విశాఖలోని కేంద్ర నిర్మాణాలకు సైతం నిధులు వెచ్చించింది. దీంతో కేంద్రం అంతరంగం ఏమిటన్నది అంతుపట్టడం లేదు.
అంచనా వ్యయం పెంపు..
2023,24 వార్షిక బడ్జెట్ ప్రతిపాదించిన నిధులను అవసరాల కోసం కేటాయింపులు చేస్తూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అమరావతిలో నిర్మించతలపెట్టిన కేంద్రీయ సచివాలయం అంచనా వ్యయాన్ని రూ.1,500 కోట్లకు పెంచింది. తక్షణమే రూ. కోటి కేటాయించింది. గతేడాది ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,244.19 కోట్లుగా ఉంది. మరో రూ.246 కోట్లకు నిధులను పెంచుతూ ఒక కోటి రూపాయలు విడుదల చేయడం గమనార్హం. రూ.46.76 కోట్ల అంచనా వ్యయంతో విశాఖ డాబాగార్డెన్స్‌లో ఆదాయపు పన్ను శాఖ నూతన భవన నిర్మాణానికి, రూ.18.17 కోట్ల వ్యయంతో విశాఖలో కేంద్ర జీఎస్టీ సిబ్బంది క్వార్టర్ల నిర్మాణానికి రూ. కోటి చొప్పున, విశాఖలో రూ.10 కోట్ల వ్యయంతో జనరల్ పూల్ ఆఫీస్ అకామడేషన్ (జీపీఏవో) నిర్మాణానికి రూ.50 లక్షలు, అందుకు రూ.5 కోట్లతో భూమి కొనుగోలుకు రూ.లక్ష కేటాయించింది.

వరుస చర్యతో కేంద్రం హడావుడి..
ఇప్పటికే అమరావతినే రాజధానిగా గుర్తించామని.. న్యాయబద్ధంగా అక్కడ నిధుల కేటాయింపులు కూడా జరిగాయని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అమరావతే రాజధాని అంటూ పలు సందర్భాల్లో కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్ర బీజేపీ నాయకులు సైతం అమరాతికి మద్దతుగా పోరాటం చేస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే అమరావతిలో కేంద్ర నిర్మాణాల అంచనాలు పెంచడం, నిధుల విడుదల చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్నికల వేళ స్పష్టతనిచ్చేందుకుగానే కేంద్రం ఇలా వ్యవహరిస్తోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అమరావతితో పాటు విశాఖ కు సైతం నిధుల కేటాయింపులు చేయడంతో వైసీపీ నేతలు మూడు రాజధానులకు కేంద్రం మద్దతు ఉంటుందని ప్రచారం చేసుకుంటున్నారు. దీనిపై కేంద్రం ఎటువంటి ప్రకటన చేస్తుందో చూడాలి మరీ.