Successful: గెలుపు వచ్చినప్పుడు పొంగిపోవడం అపజయం కలిగినప్పుడు కుంగిపోవడం అల్పసంతోషి చేసే పనులు. విజయమైనా అపజయమైనా సమంగా చూడాలి. అపజయం దరిచేరినప్పుడు విజయం ఎందుకు దక్కలేదనే విషయంపై శోధించాలి. విజయం దక్కినప్పుడు ఇంకా మెరుగ్గా ఎలా ఉండాలనే దానిపై వ్యూహాలు ఖరారు చేసుకోవాలి. విజయమైనా వీర స్వర్గమైనా ఒకటే. ప్రతి విషయంలో విజయం దక్కాలని ఉండదు. కానీ విజయమంత్రం తెలిసిన వాడు ఎప్పటికి కూడా ఫెయిల్ కాడు. పని మొదలు పెట్టే ముందే అందులో ఉండే లోతుపాతుల్ని బేరీజు వేసుకుంటే విజయం దక్కడం పెద్ద కష్టమేమీ కాదు.

విజేతలు కొన్ని విషయాలను లెక్కలోకి తీసుకుని మసలుకుంటారు. ఏదో మన పరిస్థితులు బాగా లేనప్పుడు అసహనానికి గురి కావొద్దు. పరిస్థితులు మన చేతుల్లో ఉన్నప్పుడు పొంగిపోకూడదు. మంచైనా చెడైనా సమానంగా చూసి విజయం వైపు అడుగులు వేయాలి. ఉద్యోగంలో, వృత్తిలో కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు హుందాగా వ్యవహరించాలి. మంచి రోజులు వచ్చే వరకు నిదానంగా ఆలోచించాలి. విజయానికి అవసరమైన దారులు వెతుక్కునేందుకు సిద్ధం కావాలి.
ఏ పనైనా వాయిదాలు వేయకుండా తక్షణమే చేయాలి. రేపు చేసే పని ఇవాళ చేయాలి. ఇవాళ చేసే పని ఇప్పుడే చేయాలనే నినాదాన్ని తూచ తప్పకుండా పాటించాలి. అప్పుడే మనకు విజయాలు సొంతం అవుతాయి. బద్ధకస్తులకు విజయాలు దక్కవు. చలాకీగా ఉండేవారికే విక్టరీ సొంతమవుతుంది. దీంతో విజయాలు సాధించే వారు నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిందే.
లక్ష్యచేదనలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా నిరాశకు గురికావద్దు. టార్గెట్ ను వదిలేయొద్దు. అంతిమంగా విజయమే తమ దారిగా చూసుకోవాలి. వెళ్లే దారిలో నమ్మకంతో ఉండాలి. ఆందోళనలకు తావు లేకుండా అవసరమైనప్పుడు తమ దారులను మార్చుకోవాలి. విజేతలకు ఆశావహ దృక్పథం ఉండాలి. చేపట్టిన పనులు పూర్తి చేసేందుకు నిరాశ దరిచేరకూడదు. తరచూ నీరసం చెందితే పనులు పూర్తి కావు. అందుకే పాజిటివ్ నేచర్ ను కలిగి ఉండటమే విజయ రహస్యమని గుర్తుంచుకోవాలి.

అనుకున్నది సాధించే క్రమంలో కాస్త రిస్క్ తీసుకోక తప్పదు. అన్ని పనులు సునాయాసంగా పూర్తి కావాలంటే కుదరదు. మనకు అనువుగా లేకపోతే చేయనని మొండికేస్తే మోసానికి వస్తుంది. అందుకే పని చేసేందుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిస్థితులను అడ్డంగా చూపకూడదు. రిస్క్ అయినా చేసుకుంటూ ముందుకెళ్తేనే విజయం మన దాసోహం అవుతుంది. పని కావాలంటే ఇతరుల సాయం తప్పనిసరి. నేను వారిని అడగనని అంటే పని కాదు. అందుకే మన పని కావాలంటే ఎవరినైనా అడిగి వారి సాయం తీసుకోక తప్పదు.