KCR- Meeting: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నవంబర్ 15న పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం వేదికగా పలు అంశాలపై చర్చించనున్నారు. పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ టీఆర్ఎస్ పై చేసిన విమర్శల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ తీసుకోబోయే నిర్ణయాలపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. మునుగోడు ఎన్నికలో నెగ్గినా చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా బీజేపీ కూడా సమ ఉజ్జీగా నిలిచి విజయంలో దోబూచులాడింది. దీంతో టీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ పట్టుకుంది. బీజేపీని ఏమరుపాటుగా తీసుకుంటే తమ ఉనికికే ప్రమాదం తెచ్చేలా ఉందని భావిస్తున్నారు. మరోవైపు ఢిల్లీ నేతలంతా తెలంగాణపైనే ఫోకస్ పెట్టడంతో ఇక ఏం చేయాలనేదానిపైనే కేసీఆర్ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. భవిష్యత్ లో జరిగే ఎన్నికల్లో బీజేపీ తమకు ప్రత్యామ్నాయంగా నిలిచే అవకాశమున్నందున దాన్ని ఎలా నిలువరించాలనే దానిమీదే నేతల చర్చ సాగనుందని సమాచారం.

మరోవైపు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్పులు చేసే విధానాలపై చర్చించనున్నారు. జాతీయ పార్టీగా చేసిన నేపథ్యంలో పార్టీ తీసకోబోయే నిర్ణయాలు ఎలా ఉండాలి? వివిధ రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు? అందజేసే పథకాలు తదితర వాటిపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో బీజేపీని ఎలా ఎండగట్టాలి? దేశవ్యాప్తంగా దాన్ని అధికారానికి ఎలా దూరం చేయాలి? అనే కోణంలో చర్చలు సాగుతాయి ఆశిస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో కూడా అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా సమావేశం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఎలా ఉన్నాయనే విషయాలపై కూలంకషంగా చర్చించనున్నారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి? ఓటింగ్ శాతాన్ని ఎలా పెంచుకోవాలి? మెజార్టీ స్థానాలు ఎలా దక్కించుకోవాలి? అనే విషయాలపై కూడా పార్టీ యంత్రాంగం దూర దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో మూడోసారి కూడా అధికారం చేజిక్కించుకోవాలనేదే టీఆర్ఎస్ మంత్రాంగం. దీని కోసం సర్వ శక్తులు ఒడ్డేందుకు సిద్ధమవుతోంది. ప్రణాళికా బద్ధంగా వ్యవహరించి రెండో పార్టీకి అవకాశమే ఇవ్వరాదనే కోణంలో ఆలోచించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ సమావేశంలో ఇంకా అనేక విషయాలు చర్చకు రానున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామగుండంలో జరగిన సభలో టీఆర్ఎస్ నేతలు, కుటుంబంపై పరోక్షంగా విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ భేటీలో వాటికి తగిన సమాధానాలు చెప్పేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తానికి రేపు జరగబోయే టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంపై అందరికి ఆసక్తి నెలకొంది. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతల సమక్షంలో చేపట్టబోయే విధానాలపై అందరికి ఉత్కంఠ ఏర్పడింది. పార్టీని ముందుకు తీసుకుపోయే క్రమంలో ఇంకా ఏం నిర్ణయాలు తీసుకుని పార్టీని జాతీయ స్థాయిలో తీసుకెళ్తారనేదానిపై అందరు ఉత్సుకత వ్యక్తంచేస్తున్నారు.