
Dalda: ఆ నూనెకు భారతీయ వంట గదుల్లో ప్రత్యేక స్థానం ఉంది. అప్పట్లో ఆ నూనె వాడని వంట లేదు. ఆ వంట తినని భారతీయుడు లేడు. అంతలా భారతీయుల వంటలతో, వంటగదులతో బంధాన్ని పెనవేసుకుంది. కానీ కాలక్రమేణా కనుమరుగైంది. భారతీయ వంటగదుల నుంచి శాశ్వతంగా దూరమైంది. ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది. చరిత్రలో నిలిచిపోయింది. అంతటి చరిత్రగల నూనె ఏంటో ? దాని కథేంటో తెలుసుకోండి.
నెయ్యి రుచి తెలియని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. నెయ్యి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మంచిదని నిపుణులు చెబుతారు. దీంతో నెయ్యి ధర అప్పట్లో సామాన్యులకు అందనంత ఎత్తులో ఉండిపోయింది. ఖరీదైన నెయ్యికి ప్రత్యామ్నాయంగా ఒక కొత్త కృత్రిమ నెయ్యి మార్కెట్లోకి వచ్చింది. దీనినే `డాల్డా` అని పిలిచేవారు. డాల్డా అనేది ఒక బ్రాండ్. నెయ్యికి ప్రత్నామ్నాయంగా హైడ్రోజినేటెడ్ ఆయిల్ ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. దీనిని డాల్డా పేరుతో మార్కెట్ చేశారు. దీనిని వనస్పతి నెయ్యి అని కూడా పిలుస్తారు. 1930లో డచ్ వ్యాపారులు దేశీయ నెయ్యికి ప్రత్యామ్నాయంగా వనస్పతి నెయ్యిని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇంగ్లాండ్ కు చెందిన లివర్ బ్రదర్స్ డాల్డాను ఇండియాకు పరిచయం చేశారు.
వనస్పతి వంట నూనెను హైడ్రోజినేటెడ్ పద్ధతిలో తయారు చేస్తారు. ఆ తర్వాత ఇది గట్టిపడుతుంది. దీనిని దేశీయ నెయ్యికి ప్రత్యామ్నాయంగా వంట నూనెల్లో వాడుతారు. చూడటానికి కూడా నెయ్యిలాగే కనిపిస్తుంది. కానీ నెయ్యి కంటే ఖరీదు తక్కువ. ఖరీదైన నెయ్యిని వంటల్లో వాడలేం. కాస్తో కూస్తో కూరల్లో వాడతారు. అంతే కానీ వనస్పతి నూనెలాగ నెయ్యిని వంటల్లో వాడితే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఈ నేపథ్యంలోనే 1931 లీవర్ బ్రదర్స్ ఇండియాలో వనస్పతి మాన్యుఫాక్చరింగ్ లిమిటెడ్ పేరుతో కంపెనీ స్థాపించారు. డచ్ నుంచి వనస్పతి నెయ్యి తయారు చేయడానికి హక్కులు కొనుగోలు చేశారు. డచ్ కంపెనీ డాడా మార్కెటింగ్ లో తమ పేరు వినియోగించాలని డిమాండ్ పెట్టింది. లీవర్ బ్రదర్స్ డాడా డిమాండ్ ను అమోదిస్తూనే.. డాడా మధ్యలో ఎల్ అక్షరాన్ని చేర్చారు. దీంతో డాల్డా పేరుతో వనస్పతి ఆయిల్ మార్కెట్ చేయబడింది.
డాల్డాను మార్కెట్ చేయడానికి లీవర్ బ్రదర్స్ చాలా కష్టపడ్డారు. భారతీయుల వంటగదికి చేర్చడం ఒక సవాలుగా మారింది. మార్కెటింగ్ నైపుణ్యంతో ప్రతి ఇంటికి చేర్చింది. భారతీయుల ఇంట్లో, వంటింట్లో చెరగని స్థానాన్ని సంపాదించింది. భారీగా సేల్స్ నమోదు చేసింది. ప్రత్యర్థి కంపెనీలకు డాల్డా చుక్కలు చూపించింది. దీంతో డాల్డా వేగానికి ఎదురులేకుండా పోయింది. కానీ కాలక్రమేణా డాల్డాను కష్టాలు చుట్టుముట్టాయి. రకరకాల ఆరోపణలు చుట్టూ మూగాయి. నాసిరకం నెయ్యి అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఆరోగ్యానికి హానికరం అంటూ వాదనలు వినిపించాయి. డాల్డాలో ఉన్న అధిక సంతృప్త కొవ్వులు ఆరోగ్యానికి హానికరం అంటూ కొందరు ప్రచారం చేశారు. దీని ఫలితంగా డాల్డా ప్రాభవం క్రమంగా మసకబారింది.

డాల్డా వాడకం ప్రమాదమని పలువురు వైద్యులు సూచించారు. రొమ్ము క్యాన్సర్, గర్భదారణ సమస్యలు, నాడీ వ్యవస్థ పై ప్రతికూల ప్రభావం, ఆస్తమా, అలర్జీ వంటి వ్యాధులు దరిచేరుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో డాల్డా వాడకం తగ్గింది. ఆరోగ్యం పై శ్రద్ధ పెరిగిన నేపథ్యంలో డాల్డాకు ప్రత్యామ్నాయ నూనెలు జనం వాడటం మొదలుపెట్టారు. ఇలాంటి ప్రచారంతో డాల్డా ప్రతిష్ట దెబ్బతిన్నదని చెప్పవచ్చు. అప్పటి వరకు రారాజుగా వెలుగొందిన డాల్డా.. ఆ తర్వాతి కాలంలో ప్రాభవాన్ని కోల్పోయిందని చెప్పవచ్చు. కానీ ఒకప్పుడు మాత్రం భారతీయుల వంటగదిని ఏలిందని చెప్పవచ్చు. అదొక మధుర స్మృతిగా నిలిచిపోయిందనవచ్చు.