https://oktelugu.com/

Theertham: తీర్థం ఎలా స్వీకరించాలో తెలుసా..?

సాధారణంగా ఏదైనా ఆలయానికి వెళ్లిన సమయంలో తీర్థాన్ని హస్త గోకర్ణ ముద్ర వేసి తీసుకోవాలని పెద్దలు చెబుతున్నారు. బోటనవేలు చూపుడు వేలిని నియంత్రిస్తుంది. చివరి మూడు వేళ్లు ముందుకు సాగుతాయి.

Written By:
  • Neelambaram
  • , Updated On : December 26, 2023 / 05:02 PM IST
    Follow us on

    Theertham: మనలో చాలా మంది తరచూ దేవాలయాలకు వెళ్తుంటారన్న సంగతి తెలిసిందే. గుడికి వెళ్లినప్పుడు అక్కడ కచ్చితంగా తీర్థప్రసాదాలను స్వీకరిస్తాం. పూజా కార్యక్రమాలు ముగిసి దైవ దర్శనం అనంతరం అక్కడి పూజారులు మనకు తీర్థ ప్రసాదాలను అందిస్తారు. అయితే ఈ తీర్థాన్ని స్వీకరించే సమయంలో చేతి ముద్రలను రకరకాలుగా పెట్టి తీసుకుంటారు. వీరిలో అతి కొద్ది మంది మాత్రమే చేతిముద్రలను సరిగా పెడతారన్న సంగతి మీకు తెలుసా..అసలు తీర్థాన్ని ఎలా తీసుకోవాలి.. చేతి ముద్రలను ఏ విధంగా ఉంచాలనేది తెలుసుకుందాం.

    సాధారణంగా ఏదైనా ఆలయానికి వెళ్లిన సమయంలో తీర్థాన్ని హస్త గోకర్ణ ముద్ర వేసి తీసుకోవాలని పెద్దలు చెబుతున్నారు. బోటనవేలు చూపుడు వేలిని నియంత్రిస్తుంది. చివరి మూడు వేళ్లు ముందుకు సాగుతాయి. ఆ విధంగా చేతి ముద్రను ఉంచి తీర్థాన్ని తీసుకుని నోటిలో వేసుకోవాలి. అలాగే తీర్థం తాగే సమయలో శబ్దం రాకుండా చూసుకోవాలట. దాంతో పాటు మనలో చాలా మంది తీర్థం తాగిన వెంటనే ఆ చేతిని తలపై రాసుకుంటారు. అయితే అలా చేయకూడదని పండితులు చెబుతున్నారు. తలపై బ్రహ్మదేవుడు ఉంటాడని, మనం ఆ విధంగా చేతిని తలపై రాయడంతో ఎంగిలి చేతిని బ్రహ్మకు అర్పించినట్లు అవుతుందని పేర్కొంటున్నారు.

    అలాగే పండితులు ఇచ్చే తీర్థాలలో మొత్తం నాలుగు రకాలు ఉంటాయి. ఇందులో మొదటిది జల తీర్థం. రెండోవది కషాయ తీర్థం, మూడోవది పంచామృత తీర్థం, ఇక నాలుగోవది పానక తీర్థం… అలాగే కొన్ని ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని తులసి తీర్థం, పచ్చకర్పూర తీర్థం, బిల్వ తీర్థం వంటి వాటిని పంచుతుంటారు. వీటిని సేవించడం వలన భక్తులు మానసిక ప్రశాంతతను పొందుతారు. జలతీర్థం తీసుకోవడం వలన అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించడంతో పాటు సకల పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. రాత్రి పూజ చేసిన తరువాత భక్తులకు ఇచ్చేది కషాయ తీర్థం. దీన్ని స్వీకరించిన వారికి ఆరోగ్య పరంగా ఎటువంటి సమస్యలు రావని చెబుతారు. ఇక పంచామృత తీర్థం.. దీన్ని తీసుకోవడం వలన మనం చేసే ప్రయత్నాలు అన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయని నమ్మకం. పానక తీర్థం స్వీకరించడం వలన అన్ని రంగాల్లో విజయం సాధిస్తారని భక్తుల నమ్మకం.