Driving license without test: ఏదైనా వాహనం నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. కానీ చాలామంది ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా అని వాహనాలను నడుపుతూ అనేక ప్రమాదాలకు కారణమవుతున్నారు. అంతేకాకుండా కొన్ని ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్ లో సరైన శిక్షణ ఇవ్వకుండా తప్పుడు దారిలో లైసెన్సులను ఇప్పిస్తున్నారు. వీటి వల్ల కూడా సరైన శిక్షణ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలు చేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆధ్వర్యంలోనే గుర్తింపు పొందిన డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొత్తగా లైసెన్సులు తీసుకునే వారికి.. డ్రైవింగ్ శిక్షణ కావాలని అనుకునే వారికి ఈ కేంద్రాలే అందిస్తాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఐదు డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. వాటి వివరాల్లోకి వెళితే..
కేంద్రం ఆధ్వర్యంలో 10 లక్షల జనాభా కి ఒకటి చొప్పున డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటిని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు రానున్నాయి. ఈ ఐదింటిలో ఒకటి ఉత్తరాంధ్రలో, మూడు కోస్తా జిల్లాల్లో, మరొకటి రాయలసీమలో ఏర్పాటు చేస్తారు. ఒక్కో డ్రైవింగ్ శిక్షణ కేంద్రానికి మూడు ఎకరాల స్థలాన్ని సేకరిస్తారు. ఇందులో డ్రైవింగ్ శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా ట్రాక్లను ఏర్పాటు చేస్తారు. ఈ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు కేంద్రం నుంచి రూ. ఐదుకోట్ల ఆర్థిక సాయం అందించనుంది. అలాగే శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఈ సెంటర్ నుంచి డ్రైవింగ్ లైసెన్సును ఇస్తారు.
అయితే ప్రభుత్వం గుర్తింపు పొందిన డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను ప్రైవేటు వ్యక్తులు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకోసం రెండు ఎకరాల స్థలాన్ని సేకరించాలి. ఈ సెంటర్ ఏర్పాటులో 85% లేదా గరిష్టంగా 2.5 కోట్ల వరకు కేంద్రం ఆర్థిక సహాయాన్ని చేస్తుంది. ఈ డ్రైవింగ్ శిక్షణ కేంద్రంలో ద్విచక్ర వాహనం, లైట్ మోటార్ వెహికల్ అంటే కార్లు, ఇవి మోటార్ వెహికల్ అంటే లారీ లేదా బస్ లు నడిపేందుకు శిక్షణ ఇస్తారు. శిక్షణతో పాటు తగిన మెలకువలు నేర్పిన తర్వాత ట్రాక్స్పై నడిపేందుకు అవకాశం ఇస్తారు. ఇలా కొన్ని రోజులపాటు శిక్షణ ఇచ్చిన తర్వాత రవాణా శాఖ వద్ద లైసెన్స్ పొందేందుకు అవకాశం ఉంటుంది.
అయితే ప్రైవేట్ స్కూల్లో డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత రవాణా శాఖ వద్ద పరీక్ష లో పాల్గొనవలసి ఉంటుంది. కానీ కేంద్రం ఏర్పాటు చేసే ఈ శిక్షణ కేంద్రాల్లో ట్రైనింగ్ తీసుకుంటే ప్రత్యేకంగా పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. శిక్షణ పూర్తయ్యాక నేరుగా లైసెన్సులు జారీ చేస్తారు. డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అనుకునేవారు రవాణా శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. అలాగే కలెక్టర్లకు కూడా దరఖాస్తు చేసుకొని అక్కడ అనుమతి తీసుకోవాలి. అంతకుముందే తగిన భూమిని సేకరించుకోవాలి.