Khairatabad Bypolls: తెలంగాణలో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ నింపాయి. నిన్నటి వరకు పార్టీలో కొంత టెన్షన్ కనిపించింది. కానీ, ఫలితాలు అనుకూలంగా రావడంతో గాంధీ భవన్‌లో ఉత్సాహం కనిపిస్తోంది. ఇక సీఎం రేవంత్‌రెడ్డి ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఫలితాల జోష్‌తో జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమయ్యే అవకాశం ఉంది. అయితే అంతకన్నా ముందే ఖైతాబాద్ ఉప ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.
పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్..
ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలు పక్కపక్కనే ఉంటాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నారు. దీంతో పక్కనే ఉన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ త్వరలో ఉప ఎన్నికలకు వెళ్తారని తెలుస్తోంది. బీఆర్‌ఎస్ నుంచి ఎన్నికైన తర్వాత కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇప్పుడు అనర్హత ముప్పును ఎదుర్కొంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన నేపథ్యంలో స్పీకర్ కార్యాలయం ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఇక వాటికి ఇప్పటివరకు ఆయన స్పందించకపోవడంతో రాజీనామా చేసే అవకాశాలపై ఊహాగానాలు వేగం పుంజుకున్నాయి.
రాజీనామా యోచనలో దానం..
దానంపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ గట్టి పట్టుదలతో ఉంది. ఉప ఎన్నికల కోసం ప్రయత్నం చేస్తోంది. కోర్టు కూడా దానంకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అనర్హత వేటు పడక ముందే పదవికి రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నారు. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తెచ్చిన ఉత్సాహంతో త్వరలో రాజీనామా చేస్తారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దానం నిర్ణయానికి మద్దతు ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది జరిగితే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందడుగు వేయగలదు. దానంతో పాటు ఖైరతాబాద్ లోతట్టు నాయకత్వం కూడా సమీకృతం కావచ్చని పార్టీ వర్గాల అంచనా.
దానం నాగేందర్ నిర్ణయం ఖైరతాబాద్‌లోని రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే సత్తా కలిగి ఉంది. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ బలం పెరిగిందా లేదా ప్రతిపక్షాలకు కొత్త అవకాశం దొరికిందా అనే చర్చలకు దారితీయవచ్చు.