Nara Lokesh: బీహార్ లో( Bihar) ఎన్డీఏ దూసుకెళ్తోంది. జేడీయుతో పాటు బిజెపి భారీ విజయం దిశగా దూసుకు వెళ్తోంది. దీంతో దేశవ్యాప్తంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు సంబరాల్లో మునిగిపోయాయి. ఏపీలో సైతం సందడి నెలకొంది. సరిగ్గా విశాఖలో పెట్టుబడుల సదస్సు ప్రారంభమైన వేళ.. బీహార్లో ఎన్డీఏ విజయం చంద్రబాబుతో పాటు లోకేష్ లో ఎనలేని ఆనందం నింపింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ పెట్టుబడుల సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. పైగా ఈ గెలుపులో మంత్రి నారా లోకేష్ సైతం కీలక భాగస్వామి కావడం విశేషం. ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రెండు రోజులు మంత్రి నారా లోకేష్ బీహార్లో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో ఎన్డీఏ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి లోకేష్ ప్రత్యేక ఆహ్వానం అందే అవకాశముంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా టిడిపి, జనసేన ఉండడంతో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సైతం బిజెపి పెద్దలు ఆహ్వానించే అవకాశం ఉంది. కానీ మంత్రి నారా లోకేష్ ను ప్రత్యేక అతిథిగా భావించే ఛాన్స్ కూడా కనిపిస్తోంది.
* చంద్రబాబు వెళ్లకుండా..
వాస్తవానికి సీఎం చంద్రబాబు( CM Chandrababu) బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తానని ప్రకటించారు. కానీ ఇంతలో విశాఖ పెట్టుబడుల సదస్సు, ఆపై విదేశీ పర్యటనలతో ఆయన బిజీగా మారారు. బీహార్లో తెలుగు ఓటర్లు తక్కువే అయినా.. ఏపీలో నిర్మాణరంగంలో బీహార్ వాసులు ఎక్కువ. ముఖ్యంగా అమరావతి తో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో బీహార్ కార్మికులు ఎక్కువగా ఉంటారు. ఆపై రాష్ట్రంలో చాలా రంగాల్లో బీహార్ కార్మికులు పనిచేస్తుంటారు. ప్రస్తుతం ఏపీలో యూత్ ఐకాన్ గా ఉన్నారు లోకేష్. అనేక రకాలుగా తనను తాను ప్రూవ్ చేసుకొని నిలబడగలిగారు. అందుకే కేంద్ర పెద్దలు నారా లోకేష్ ను ఎన్నికల ప్రచారానికి పంపాలని చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది. వారి కోరిక మేరకు మాత్రమే బీహార్లో లోకేష్ పర్యటించారు. ఎన్డీఏ విధానాలు చెప్పడంతో పాటు ఏపీలో వన్ చాన్స్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని వారికి వివరించారు. బీహార్ కు అటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని సూచించారు. ఇవి అక్కడి ప్రజల్లోకి బలంగా వెళ్లినట్లు తెలుస్తోంది.
* పెట్టుబడులు రావడం వెనుక..
ఇటీవల ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తున్న సంగతి తెలిసిందే. ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్( Google data centre) విశాఖ ఏర్పాటు కానుంది. ప్రపంచ ఐటి దిగ్గజ సంస్థలు సైతం వస్తున్నాయి. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోటీపడి మరి పరిశ్రమలను తెస్తున్నారు. అయితే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం జరిగిన తర్వాత జాతీయస్థాయిలో సైతం లోకేష్ పేరు మార్మోగిపోయింది. లోకేష్ ఇమేజ్ జాతీయస్థాయిలో పెరిగింది. అటు బీహార్ లో సైతం ఎన్డీఏ భాగస్వామ్య పక్షం నడుస్తోంది. ఈ తరుణంలో లోకేష్ ను ప్రచారంలో దింపడం ద్వారా ఎన్డీఏకు మద్దతు పెంచవచ్చు అన్న ఆలోచనలో పడ్డారు కేంద్ర పెద్దలు. లోకేష్ కు ప్రచారానికి పిలవగా ఆయన నాలుగు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ నాలుగు ప్రాంతాల్లో ఎన్డీఏ ఘనవిజయం సాధించింది. దీంతో లోకేష్ కు మరింత పేరు వచ్చింది. జాతీయస్థాయిలో బిజెపి పెద్దలు సైతం లోకేష్ కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది.