Alone: మనుషుల మధ్య సంబంధాలు ఎంతో ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. అందుకే ఒకప్పుడు మనుషులు గుంపులుగా జీవించేవారు. ఒక ఊరు, ప్రాంతంలో అందరూ కలిసిమెలిసి ఉండేవారు. కానీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒకరికొకరు మాట్లాడుకోవడమే కరువవుతుంది. ముఖ్యంగా మొబైల్ చేతిలోకి రాగానే మనుషులు మాట్లాడుకోకుండా మొబైల్ ద్వారానే మెసేజ్లు పంపుతున్నారు. ఫోన్ తోనే మాట్లాడుతున్నారు. అయితే ఎప్పటికి ఇలా ఉండడంవల్ల మానవ జీవితానికి ముప్పే అని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీనిపై ఇటీవల నిర్వహించిన పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే?
World Health Organisation (WHO) సర్వే ప్రకారం ప్రతి ఏడాది 8 లక్షలకు పైగా మంది ఒంటరితనంతోనే చనిపోతున్నట్లు తెలిపింది. అంటే గంటకు 100 మంది మరణిస్తున్నారని పేర్కొంది. ఒంటరితనం మానసికంగా మాత్రమే కాకుండా గుండె జబ్బులకు కూడా దారితీస్తుందని.. క్రమంగా ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు కూడా కారణమవుతుందని చెబుతున్నారు. అందువల్ల దాదాపుగా ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయకుండా.. స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసిమెలిసి ఉండాలని.. ఇలా ఉండడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య సంస్థ తెలుపుతుంది.
అయితే ప్రస్తుతం పట్టణీకరణ, నగరికరణ కారణంగా కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోంది. దీంతో ఎక్కడి వారు అక్కడే ఉంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఒంటరితనాన్ని ఫేస్ చేస్తున్నారు. ఇలా ఎప్పటికీ ఒంటరిగా ఉండటంవల్ల మానసికంగా కృంగిపోతున్నారు. ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో తడబడుతున్నారు. ముఖ్యంగా ఒత్తిడి సమయంలో ఒంటరిగా ఉన్న వాళ్లలో రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనల వల్ల ఒక్కోసారి ప్రాణాలకు కూడా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఒంటరితనం వల్ల ఎక్కువగా మానసిక ఆందోళన చెందుతూ ఒకే చోట కూర్చోవడం వల్ల బరువు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఆహార క్రమబద్ధీకరణ ఉండదు. దీంతో సరైన ఆహారం తీసుకోకుండా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు ఉండేవి. అందరూ ఒకే చోట కలిసి ఉండేవారు. ఒకరి బాధలు మరొకరు చెప్పుకునేవారు. అందరూ కలిసి సరదాగా విహారయాత్రలకు వెళ్లేవారు. ఇలా కలిసి మెలిసి ఉండడంవల్ల మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉండేవారు. మానసిక ఉల్లాసం మనిషి ఆరోగ్యాన్ని పెంచుతుంది. కలిసిమెలిసి ఉండడం వల్ల ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉండగలుగుతారు.
ఒకవేళ ఒంటరిగా ఉన్నామని అనుకుంటే కార్యాలయంలోని ఉద్యోగులతో లేదా స్నేహితులతో కాలక్షేపానికి వెళుతూ ఉండాలి. వీకెండ్ లేదా మంత్ ఎండ్ విహారయాత్రలకు వెళుతూ ఉండాలి. అలాకాకుండా కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉండాలి. వీలైతే పాత స్నేహితులను కలుస్తూ మానసికంగా ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగించాలి. ఇలా చేస్తే కొన్ని రకాల వ్యాధులనుంచి బయటపడే అవకాశం ఉంటుంది.