Nepali Youth: తుఫాన్ ఏర్పడిన తర్వాత ప్రశాంతత నెలకొంటుంది అంటారు. ఇప్పుడు నేపాల్ దేశంలో కూడా అలానే జరుగుతోంది. మొన్నటిదాకా కల్లోలంగా ఆ దేశం ఉంది. యువత చేసిన పోరాటాలతో ఉద్రిక్తంగా మారింది. ఆందోళనలు, భీకరమైన సంఘటనలతో ఆ ప్రాంతం మొత్తం యుద్ధ భూమిని తలపించింది. ప్రభుత్వ కార్యాలయాలు తగలబడిపోయాయి. ప్రైవేట్ భవనాలు అగ్నికి ఆహుతి అయిపోయాయి. యువత ఆగ్రహానికి ఏకంగా ప్రభుత్వమే కూలిపోయింది. ప్రభుత్వ పెద్దలు బతుకు జీవుడా అనుకుంటూ వెళ్లిపోయారు.
Also Read: మిరాయి ని తొక్కెయాలని చూస్తున్న స్టార్ హీరోలు…ఇదే సాక్ష్యం…
ప్రస్తుతం అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అక్కడి సర్వోన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మహిళ ప్రస్తుతం ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశాన్ని గాడిలో పెట్టడానికి ఆమె ప్రణాళికలు ప్రారంభించారు.. చుట్టూ ఉన్న దేశాలతో స్నేహపూర్వకమైన వాతావరణాన్ని కోరుకుంటున్నట్టు ఆమె ప్రకటించారు. నేపాల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని.. అన్ని దేశాల సహకారం ఇందుకు అవసరమని ఆమె పేర్కొన్నారు. నేపాల్ లో ప్రజా సమస్యల పరిష్కారానికి దశలవారీగా కృషి చేస్తామని.. ఇందుకోసం కాస్త సమయం పడుతుందని ఆమె పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో అక్కడ ఇప్పుడిప్పుడే పరిస్థితులు పూర్వ స్థితికి వస్తున్నాయి. జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంది. రోడ్లపై రాకపోకలు మొదలయ్యాయి. ఇతర కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతున్నాయి.
ఇటీవల అక్కడ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత యువతరం ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసింది. ఇంకా కొన్ని వస్తువులను తమ తమ గృహాలకు తీసుకుపోయింది.. దీంతో యువతరం పోరాటం మీద అందరికీ అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇటువంటి విధ్వంసం కోసమేనా పోరాటం చేసిందని అందరూ ఆరోపించడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో యువతరం చేసిన వీడియోలు ప్రముఖంగా ప్రసారం కావడంతో అందరూ అసహనం వ్యక్తం చేశారు. ఇటువంటి విధ్వంసం వల్ల జరిగే అభివృద్ధి ఏముంటుందని మండిపడ్డారు. అయితే సోషల్ మీడియా వల్ల వచ్చిన విమర్శలకు బదులు చెప్పేలా నేపాల్ యువతరం మళ్లీ రోడ్లమీదకి వచ్చింది. రోడ్లను మొత్తం బాగు చేయడం మొదలుపెట్టింది. ధ్వంసమైన ఆస్తులను పరిరక్షించడం ప్రారంభించింది. దొంగిలించిన వస్తువులను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడం ప్రారంభించింది. రోడ్లపై పేరుకుపోయిన దుమ్మును.. ఇతర వ్యర్ధాలను యువత తొలగిస్తోంది. నీటితో శుభ్రం చేస్తోంది. ఇప్పుడు ఈ వీడియోలు సామాజిక మాధ్యమాలను ఊపేస్తున్నాయి. నేపాలి యువత అందరికీ ఆదర్శమని.. వాస్తవాన్ని వారు స్వీకరించారని నెటిజన్లు అంటున్నారు.