Fridge: చాలా మంది ఇళ్లల్లో వస్తువులను సర్దుకోవడంలో చాలా ఇబ్బంది పడుతుంటారు. కొందరి ఇళ్లల్లో స్థలం తక్కువగా ఉండడంతో ఫ్రిజ్‌పై వివిధ రకాల వస్తువులను ఉంచుతుంటారు. వంటనూనె సీసాలు, పండ్లు, కిరాణా సామగ్రి వంటి వాటిని ఫ్రిజ్‌పై పెట్టడం చాలా సాధారణం. అయితే ఇలా చేయడం ఆహార నాణ్యత దెబ్బతినడమే కాకుండా కొన్ని సందర్భాల్లో అగ్నిప్రమాదాలకు కూడా కారణమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.య అదెలాగో ఇప్పుడు చూద్దాం..
ఫ్రిజ్ లోపల చల్లగా ఉన్నప్పటికీ.. దాని వెనుక భాగం, పైభాగంలో ఉండే కండెన్సర్ కాయిల్స్, కంప్రెసర్ పని చేసే సమయంలో కొంత వేడి విడుదల చేస్తాయి. దీంతో ఫ్రిజ్ పైభాగంలో ఉష్ణోగ్రత సాధారణ గది ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ వేడి వల్ల అక్కడ ఉంచిన కొన్ని వస్తువులు త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ వంటనూనె సీసాలను ఫ్రిజ్‌పై ఉంచడం వల్ల అధిక వేడితో నూనెల రుచి, నాణ్యత దెబ్బతింటుందని అంటున్నారు.
అరటిపండ్లు, యాపిల్స్ వంటి తాజా పండ్లను ఫ్రిజ్‌పై ఉంచితే వేడి ప్రభావంతో అవి త్వరగా మగ్గిపోవడం, రుచి కోల్పోవడం వంటివి జరుగుతాయి. పండ్లను నేరుగా సూర్యరశ్మి లేదా వేడి తగలని ప్రదేశంలో ఉంచడం మంచిది. కొందరు ఫినాయిల్, బ్లీచింగ్ లిక్విడ్ వంటివి కూడా ఇక్కడ ఉంచుతారు. వీటి మూత సరిగా లేక లీక్ అయితే రసాయన పదార్థాలు ఫ్రిజ్ పై పడి ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు వంటివి కూడా ఫ్రిజ్‌పై ఉంచకూడదు. సాధారణంగా ఫ్రిజ్ సురక్షిత పరికరమే అయినప్పటికీ.. విద్యుత్ లోపాలు లేదా అధిక వేడి వంటి అరుదైన పరిస్థితుల్లో మంటలు వ్యాపించే ప్రమాదాన్ని పూర్తిగా తోసిపుచ్చలేమని నిపుణులు సూచిస్తున్నారు.
ఫ్రిజ్ పై ఇలాంటి వస్తువులు ఉంచవద్దు.. ఇదే సమయంలో ఫ్రిజ్ చుట్టూ గాలి సరిగా ప్రసరించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. పైభాగాన్ని పూర్తిగా వస్తువులతో నింపితే వేడి బయటకు వెళ్లే ప్రక్రియకు కొంత ఆటంకం కలగవచ్చు. దీని వల్ల విద్యుత్ వినియోగం పెరగడం, ఫ్రిజ్‌పై అదనపు ఒత్తిడి పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఫ్రిజ్ పైభాగాన్ని సాధ్యమైనంత వరకు ఖాళీగా ఉంచడమే ఉత్తమం. తప్పనిసరిగా ఏదైనా ఉంచాల్సి వస్తే తేలికపాటి, వేడి వల్ల దెబ్బతినని వస్తువులు మాత్రమే ఉంచడం మంచిది.