Tamarind: చింత చెట్టు చింతలు తీర్చే చెట్టు అంటారు. చింత చెట్టుతో ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి. చింత చెట్టులో ప్రతి భాగం మనకు ఉపయోగకరంగానే ఉంటుంది. చింతకాయలు కాచాయంటే ఏడాదంతా ఎన్నో వంటల్లో వీటిని వాడుకోవడం సహజమే. చింత చెట్టుతో మనకు కలిగే లాభాలు చాలా ఉన్నాయి. చింత చెట్టు జీవిత కాలం చాలా ఎక్కువ. దాదాపు అరవై డెబ్బై ఏళ్లు బతుకుతుంది. అందుకే చింత చచ్చినా పులుపు చావలేదు అంటారు. ఈ చెట్టులో ఉండే ప్రయోజనాలు ఎన్నో దాగి ఉండటంతో పలు మందుల్లో కూడా దీని భాగాలు వేస్తుంటారు.

చింత చిగురును కూరగా చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎంతో ఇష్టంగా తింటుంటారు. పచ్చడిగా కూడా చేసుకుంటారు. చింతాకు చేసిన టీతో మలేరియా జ్వరం నియంత్రణలోకి వస్తుంది. ఇలా ప్రతి భాగాన్ని కూడా పలు ఔషధాలుగా ఉపయోగించుకోవడం మామూలే. అందుకే చింతచెట్టులో మనకు తెలియని ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్న సంగతి చాలా మందికి తెలియదు. చింతపండు రక్తహీనతను తగ్గిస్తుంది. మన శరీరంలో రక్తం పెరిగేందుకు కూడా చింత ఎంతో సాయపడుతుంది.
చింతచిగురు రసంలో పటిక బెల్లం కలిపి తీసుకుంటే కామెర్లు తగ్గిపోతాయి. ఒంట్లో వేడి, వాతం నుంచి ఉపశమనం లభిస్తుంది. చింతాకును ఉడికించి కీళ్లవాపులకు రాస్తే వాపుతో పాటు నొప్పి కూడా పోతుంది. కీళ్ల జబ్బులున్న వారు చిగురు రసం రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కడుపు ఉబ్బరం, తేన్పులు, జ్వరం, వికారం ఉన్నప్పుడు చింతపండును ఔషధంగా వాడుకోవచ్చు. ఆకలిని పెంచడంలో కూడా చింతపండు ప్రధాన పాత్ర పోషిస్తుంది.

భోజనం చివరలో చింతపండుతో చేసిన రసం వేసుకుంటే అన్నం త్వరగా జీర్ణం కావడానికి దోహదపడుతుంది. అజీర్తి సమస్యలకు చెక్ పెడుతుంది. మూత్రకోశ వ్యాధులను నివారిస్తుంది. కిడ్నీల్లో రాళ్లున్నా కరిగిపోయేలా చేస్తుంది. చింతగింజలను వేడిచేసిన తరువాత పొడి చేసుకుని రోజు ఒక చెంచా పొడిని నీటిలో కలిపి తీసుకుంటే జిగట విరేచనాలు తగ్గుతాయి. రక్తస్రావం కాకుండా నిరోధిస్తుంది. వీర్య వృద్ధికి సాయపడుతుంది. ఇలా చింతచెట్టులో ఉండే ఔషధ గుణాలతో అది మనకు ఎన్నో రకాలుగా తోడ్పడుతుంది.