Digital Payments: దేశంలో డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ (UPI) అగ్రస్థానంలో ఉంది. సామాన్యుల నుంచి బడా బాబుల వరకు ఇప్పుడు అంతా దీనినే ఫాలో అవుతున్నారు. నగదు బదిలీ చేసుకోవడానికి సమయం ఆదా కావడంతో పాటు, ఖర్చు కూడా లేకపోవడంతో థర్డ్ పార్టీ యాప్ లను ఇన్ స్టాల్ చేసుకొని వాడుతున్నారు. అయితే యూపీఐ (UPI) ద్వారా డబ్బును ట్రాన్స్ ఫర్ చేసుకోవాలంటే డెబిట్ కార్డు తప్పనిసరి. ఈ కార్డుకు సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేస్తేనే డిజిటల్ చెల్లింపులకు ఆస్కారం ఉంటుంది. కానీ డెబిట్ కార్డు లేకున్నా.. మనీ ని మార్చుకోవచ్చు. ప్రముఖ డిజిటల్ సంస్థ ‘ఫోన్ పే’ ఇలాంటి కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆ వివరాలేంటో చూద్దాం..

ఈమధ్య డిజిటల్ చెల్లింపులు ఎక్కువైపోయాయి. కూరగాయలు అమ్మే వ్యక్తి నుంచి పెద్ద పెద్ద షోరూంల వరకు అందరూ మొబైల్ ద్వారా నగదును మార్చుకుంటున్నారు. మొబైల్స్ లోని కొన్ని యాప్స్ లో వినియోగదారులకు అనువైన సౌకర్యాలు ఉండడం తో అందరూ ఈ రకమైన చెల్లింపులే చేస్తున్నారు. అయితే నగదు బదిలీ చేసుకోవడానికి ఏ యాప్ వాడాలన్నా డెబిట్ కార్డు తప్పనిసరి. ఈ కార్డు సంబంధించిన వివరాలు ఎంట్రీ చేసిన తరువాత మొబైల్ లింక్ ఉన్న నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ తరువాత ఓటీపీ ని ఎంటర్ చేసి పిన్ నెంబర్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పిన్ ఆధారంగా యాప్ లోకి వెళ్లొచ్చు. ఆ తరువాత సంబంధిత యాప్ కు మన బ్యాంకు ఖాతా లింక్ చేయబడుతుంది. దీంతో మనకు కావాల్సిన డబ్బును ఇతరులకు పంపవచ్చు.
ఇప్పుడు డెబిట్ కార్డు తో పనిలేకుండా బ్యాంకు ఖాతాను యాప్ కు లింక్ చేసుకోవచ్చు. ఆ సౌకర్యాన్ని తాము కల్పిస్తున్నామని ఫోన్ పే ప్రకటించింది. అయితే ఇందుకు ఆధార్ తప్పనిసరి. ఆధార్ లోని చివరి ఆరు అంకెలను ఉపయోగించి బ్యాంకు ఖాతాను ఫోన్ పే యాప్ కు లింక్ చేసుకోవచ్చు. బ్యాంకు లింకైన తరువాత సంబంధిత మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత దానిని ఎంటర్ చేసిన పిన్ నెంబర్ సెట్ చేసుకోవాలి.

ఇలా చేసుకున్న తరువాత ఇతర చెల్లింపులు లాగే మనీని బదిలీ చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్ ను కూడా చెక్ చేసుకోవచ్చు. యూపీఐ (UPI) సేవలను మరింత మందికి చేరువవ్వాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు కంపెనీ హెడ్ దీప్ అగర్వాల్ పేర్కొన్నారు. పలు కారణాల వల్ల చాలా మందికి డెబిట్ కార్డులు లేవు. అవి తీసుకోవాలంటే పెద్ద ప్రయాసే. ఇలాంటి వారు బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఈ తరుణంలో ఫోన్ పే ప్రవేశపెట్టిన కొత్త విధానం ఎంతో ఉపయోగపడుతుందని ఫోన్ పే ప్రతినిధులు పేర్కొంటున్నారు