
Corona Virus Vaccine: దేశంలో కరోనా కేసులు తగ్గినా తగిన జాగ్రత్తలు తీసుకోని పక్షంలో వైరస్ బారిన పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటివరకు 18 సంవత్సరాల వయస్సు పైబడిన వాళ్లకు మాత్రమే వ్యాక్సిన్ వేయించుకోవడానికి అవకాశం ఉండేది. అయితే కేంద్రం తాజాగా చిన్నారులకు శుభవార్త చెప్పింది. చిన్నారుల కొరకు దేశీయ కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది. డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా 2 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలకు కోవాగ్జిన్ వ్యాక్సిన్ వినియోగానికి సంబంధించి అనుమతులు ఇచ్చింది.
గత నెలలో చిన్నారులపై వ్యాక్సిన్ ప్రయోగాలు పూర్తయ్యాయి. నిపుణుల కమిటీ ఇప్పటికే వ్యాక్సిన్లకు సంబంధించిన ఫలితాలను పరిశీలించింది. చిన్నారుల కొరకు కేంద్రం అనుమతి పొందిన తొలి వ్యాక్సిన్(Corona Virus Vaccine) గా కోవాగ్జిన్ నిలవడం గమనార్హం. ఎక్స్‌పర్ట్ ప్యానల్ సిఫారసు చేయడంతో 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లకు సైతం కోవాగ్జిన్ వ్యాక్సిన్ కు సంబంధించిన అనుమతులు లభించాయి.
భారత్ బయోటెక్ మొత్తం 525 మందిపై కోవాగ్జిన్ వ్యాక్సిన్ కు సంబంధించిన ప్రయోగాలు చేసింది. రెండు, మూడు దశలలో కరోనా వ్యాక్సిన్ కు సంబంధించిన ప్రయోగాలు జరగగా మూడు దశలలో ఈ ప్రయోగాలు జరిగాయి. 2 నుంచి 6 సంవత్సరాల వయస్సు వారిపై, 6 నుంచి 12 సంవత్సరాల వయస్సు వారిపై, 12 నుంచి 18 సంవత్సరాల వయస్సు వారిపై ఈ ప్రయోగాలను జరిపారు.
అయితే పిల్లలపై కరోనా వ్యాక్సిన్ ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. కోవాగ్జిన్ వ్యాక్సిన్ కు అనుమతులు లభించడంతో పిల్లలకు కూడా కరోనా ముప్పు తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు.