Naresh and Vishnu: ‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ బలి పశువు అయ్యాడు. ఇది బయటకు వినిపిస్తున్న మాట. కారణం.. ప్రకాష్ రాజ్ ని ఎగదోసిన మెగా కుటుంబం.. పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో కనీసం తమ ఫ్యామిలీలోని వ్యక్తుల చేతే కూడా ఓట్లు వేయించ లేకపోయింది. మరోపక్క విష్ణు ఎక్కడో ఢిల్లీలో ఉన్న జయప్రద దగ్గర నుంచి జెనీలియా వరకూ అందర్నీ తీసుకొచ్చాడు. మరీ ఇంత చేసి గెలిచిన విష్ణు చివరకి సాధించింది ఏమిటి ?

మా ఎన్నికల వ్యవహారం చినికి చినికి గాలివానగా మారి కొందరి మనసులను బాగా గాయపరిచింది. సహజంగా కళాకారులకు ఇగో ఎక్కువ ఉంటుంది. కానీ, ఆ ఇగోని రెట్టింపు చేసి.. మొత్తానికి బాగా బాధ పడేలా జరిగాయి ఎన్నికలు. కానీ ఇప్పుడు మంచు విష్ణుకి సవాళ్లు ప్రతి సవాళ్లు ఎక్కువవుతున్నాయి. నిజానికి మా ఎన్నికల్లో తేనెతుట్టను కదిపింది మాత్రం నాగబాబునే.
ప్రకాష్ రాజ్ – మంచు విష్ణు ఇద్దరూ గట్టిగా విమర్శలు చేసుకున్నా.. పరిధి దాటలేదు. కానీ నాగబాబు ఎంట్రీ ఇచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. నాగబాబును చూసి తనకు మెగా మద్దతు వుందనే భావనతో ప్రకాష్ రాజ్ కూడా చివర్లో రెచ్చిపోయాడు. పెద్దలు లేదు గిద్దలు లేదు అంటూ అన్యాపదేశంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు.
దాంతో ఎన్నికల భేరి గట్టిగా మోగింది. రెండు వైపుల హడావుడి బాగా జరిగింది. సిట్టింగ్ అధ్యక్షుడు నరేష్ చిద్విలాసంగా నవ్వుకుంటూ, నవ్విస్తూ ప్రత్యర్థులను కవ్విస్తూ కసిగా విమర్శిస్తూ మొత్తానికి మా ఎన్నికల భాగవతంలో తనది కృష్ణుడు పాత్ర అని సగర్వంగా చాటుకున్నాడు. ఇక విజయం విష్ణుకి దక్కింది.
అయితే, ఆ విజయానికి కారణమైన నరేష్ పై ఇప్పుడు విష్ణు యాక్షన్ తీసుకోవాలని తాజాగా శివాజీ రాజా డిమాండ్ చేస్తున్నాడు. నరేష్ ‘మా’ లో కొన్ని తప్పులు చేశాడు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఆరోణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విష్ణు ఏమి చేస్తాడు ? తనను గెలిపించిన నరేష్ పై విష్ణు యాక్షన్ తీసుకుంటాడా ? నరేష్ కి వ్యతిరేఖంగా విష్ణు నిర్ణయాలు తీసుకోగలడా ?