Court judgement on Cohabitation: మానవ సంబంధాలు రోజులు మారుతున్న కొద్దీ చెడిపోతున్నాయా? లేక బాగుపడుతున్నాయా? అనేది అర్థం కావడం లేదని చాలామంది మేధావులు చర్చిస్తున్నారు. ఒక్కోసారి సామాజికంగా, నైతికంగా సరైనది కాని విషయంలోనూ న్యాయవ్యవస్థలు తీర్పులు చెప్పడంపై దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చ సాగుతోంది. భారతీయ వివాహ చట్టం ప్రకారం పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు జీవితాంతం కలిసి ఉండాల్సిన అవసరం ఉంది. అయితే కొన్ని కారణాలవల్ల వీరు విడిపోవాల్సి వస్తే కోర్టు ద్వారా విడాకులు తీసుకోవాలి. కానీ పెళ్లయిన భర్త లేదా భార్య ఉండి కూడా మరొకరితో లివింగ్ రిలేషన్ ఉండడం సమంజసమే అని కోర్టు తీర్పు ఇవ్వడం పై తీవ్రమైన చర్చ సాగుతోంది? అసలు ఏం జరిగిందంటే?
2025 అక్టోబర్ 6న పంజాబ్ హర్యానా కోర్టు సంచలనమైన తీర్పును ఇచ్చింది. పెళ్లయి భర్త, బిడ్డ ఉన్న ఒక మహిళ మరొక వ్యక్తితో లివింగ్ రిలేషన్షిప్ కొనసాగించింది. అయితే తమకు భర్త నుంచి రక్షణ కల్పించాలని వేసిన పిటీషన్ ను కోర్టు సమర్థిస్తూ వారికి రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. యశ్ పాల్ వర్సెస్ స్టేట్ హర్యానా ఆఫ్ కోర్టు 2024 తీర్పులో భాగంగా.. వ్యక్తులకు రక్షణ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపింది. సత్నాం సింగ్, ఓ మహిళతో కలిసి లివింగ్ రిలేషన్షిప్ కొనసాగిస్తున్నారు. అయితే ఆమెకు అప్పటికే వేరుగా వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఒక బిడ్డ కూడా ఉన్నారు. అయితే వారి సంబంధాల్లో విభేదాలు ఏర్పడి విడాకుల కోసం కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఈ క్రమంలోనే ఈమె సత్నాం సింగ్ అనే పెళ్ళికాని వ్యక్తితో సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఈ మహిళ తనకు భర్తతో నుంచి ప్రమాదం ఉందని.. వారి నుంచి రక్షణ కల్పించాలని కోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటిషన్లపై పంజాబ్ హర్యానా కోర్టు లివింగ్ రిలేషన్షిప్ జరిపే జంటకు రక్షణ కల్పించాలని తీర్పు చెప్పింది.
గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్. ఖుష్బూ వర్సెస్ కన్నిమమాల్ వంటి కేసులను ఉదాహరణ చేసుకుంటూ ఈ తీర్పును ఇచ్చారు. అయితే ఈ తీర్పుపై తీవ్రమైన చర్చ సాగుతోంది. భారతీయ వివాహ చట్టం ప్రకారం ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ వ్యక్తితో విడాకులు తీసుకోకుండా మరొక వ్యక్తితో సంబంధాన్ని కొనసాగించడం ప్రస్తుతానికి సమాజంలో నైతికం కాదని కొందరు అంటున్నారు. పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇష్టం లేకపోతే అతనితో పూర్తిగా విడాకులు తీసుకుని మరొక వ్యక్తితో కలిసి ఉండవచ్చని అంటున్నారు. అందులోనూ మొదటి వ్యక్తితో సంతానం కలిగి ఉన్న బిడ్డను ఉండి కూడా మరొక వ్యక్తితో రిలేషన్ కొనసాగించడం భారతీయ ఆచార, వ్యవహారాలకు విరుద్ధంగా వ్యవహరించడమేనని అంటున్నారు. వ్యక్తులకు రక్షణ కల్పించడంలో కోర్టు తీర్పు సరైనదే అనిపించినప్పటికీ.. సంబంధాల విషయంలో మాత్రం ఇది ఏమాత్రం సమంజసం కాదని కొందరు అంటున్నారు.