https://oktelugu.com/

Viral News : పెళ్లంటే ఆడంబరం కాదు.. ఓ పరమార్ధం.. ఈ జంట చేసిన పని 100 ఏళ్ల వరకు గుర్తుంటుంది.. వీడియో వైరల్

పెళ్లంటే.. ఒక సంస్కృతి. ఒక సంప్రదాయం.. రెండు భిన్నమైన మనసుల కలయిక.. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పెళ్లి అంటే ఆడంబరం.. అట్టహాసం.. స్థాయిని మించి ఖర్చు. ఫోటోషూట్లు.. సాంగ్ షూట్లు.. మెహందీ, హల్ది, మంగళ స్నానం, వివాహం, విందు వినోదాలు, బారాత్.. ఇలా ఎన్నో అదనపు ఆకర్షణలు పెళ్ళిలో చేరాయి..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 29, 2024 / 05:14 PM IST
    Follow us on

    Viral News : అయితే ఈ జంట మాత్రం పెళ్లికి సరికొత్త అర్ధాన్ని చెప్పింది. ఆడంబరం కాకుండా.. అట్టహాసాన్ని ప్రదర్శించకుండా.. పరమార్ధాన్ని మాత్రమే వివరించేలా చేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ ప్రాంతంలో దీక్షా యాదవ్ అనే యువతీ ఉంది. ఆమె ఒక ఎన్జీవోను నడిపిస్తున్నారు. దీనిద్వారా మారుమూల గ్రామాలలో ఉన్న పిల్లలకు చదువు చెపుతారు. వైద్య సదుపాయాలు కల్పిస్తారు. దుస్తులు, పుస్తకాలు, ఇతర సామాగ్రి విద్యార్థులకు అందిస్తారు. ఇప్పటివరకు ఆమె ఎన్జీవో ద్వారా వేలాది మంది పిల్లలకు సహాయ సహకారాలు అందించారు. విద్య ద్వారానే సమాజం మారుతుందని.. అద్భుతమైన యువతరం రూపుదిద్దుకుంటుందని దీక్ష యాదవ్ నమ్ముతారు. అందువల్లే ఉన్నత చదువులు చదివినప్పటికీ.. తన స్వలాభం మాత్రమే చూసుకోకుండా.. ఎన్జీవో ను ఏర్పాటు చేసి విద్యార్థుల సేవలో తరిస్తున్నారు. ఇక ఇటీవల దీక్ష యాదవ్ వివాహం చేసుకున్నారు. దీక్ష యాదవ్ నడిపిస్తున్న ఎన్జీవో ని చూసి ఓ వ్యక్తి ఆమెను ఇష్టపడ్డాడు. ఇద్దరు అభిప్రాయాలు కలవడంతో.. రెండు కుటుంబాల సభ్యులను ఒప్పించి వారు వివాహం చేసుకున్నారు.

    అర్ధాన్ని మార్చే శారు

    దీక్ష యాదవ్ తన వివాహాన్ని అత్యంత నిరాడంబరంగా జరుపుకుంది. ఖర్చులకు తావు ఇవ్వలేదు. అనవసరమైన హంగామాలకు చోటు ఇవ్వలేదు. ఆడంబరాలకు పోలేదు. హంగులకు వృధా ఖర్చు చేయలేదు. మొత్తంగా తక్కువ ఖర్చులోనే పెళ్లి చేసుకున్నారు. ఇదే క్రమంలో 11 మంది పిల్లలకు కొత్త జీవితాన్ని ఇచ్చే విధంగా వారు ఒక తీర్మానాన్ని రూపొందించారు. ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరూ ఆ పిల్లల బాగోగులు చూసుకుంటామని.. విద్యాబుద్ధులు నేర్పిస్తామని.. సమాజంలో ఉన్నతమైన పౌరులుగా ఎదిగేలా తమ వంతు కృషి చేస్తామని మాట ఇచ్చారు. ఈ వ్యవహారం మొత్తం దీక్ష కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమానికి బంధువులు కూడా భారీగానే హాజరయ్యారు. అంతకంటే ముందు దీక్ష 11 మంది పిల్లల దత్తత కార్యక్రమానికి సంబంధించి అధికారులు అనుమతి కూడా తీసుకుంది. వారు ఓకే చెప్పిన తర్వాతే ఆ 11 మంది పిల్లల్ని దీక్షా యాదవ్ దంపతులు దత్తత తీసుకున్నారు.

    దీక్ష యాదవ్ కు సంపూర్ణ మద్దతు

    ఎవరైనా భార్య సంఘ సేవ చేస్తోంది.. ఎన్జీవో నడిపిస్తోంది అంటే వద్దని చెబుతారు. కుటుంబ బాధ్యతలు ఉన్న తర్వాత ఇలాంటివన్నీ ఎందుకని వారిస్తారు. కానీ దీక్ష యాదవ్ భర్త మాత్రం ఎందుకు పూర్తి విభిన్నం. తన భార్య చేస్తున్న సామాజిక సేవను ఆయన అభినందించారు. ప్రోత్సహించారు. అందువల్లే ఆమె 11 మంది పిల్లల్ని దత్తత తీసుకోగలిగారు. అయితే వారికి అయ్యే ఖర్చు మొత్తం కూడా దీక్ష యాదవ్ భర్త భరిస్తుండడం విశేషం.. ” ఆమె సున్నిత మనస్కురాలు. గొప్పగా ఆలోచిస్తుంది. సామాజిక సేవ చేయాలని తపన పడుతూ ఉంటుంది. అందువల్లే ఆమె ఇష్టాన్ని నేను కాదన నేను. ఆమె అభిరుచిని తొక్కి పెట్టలేను. ఇది కూడా నాకు ఉత్సాహాన్ని ఇస్తోందని” దీక్షయాదవ్ భర్త చెప్పుకొచ్చాడు.. తన భార్యకు సహకారం అందించడం పూర్వజన్మ సుకృతం అని అతడు పేర్కొంటున్నాడు. మరోవైపు భర్త తనకు సహకారం అందించడంతో దీక్ష ఆనందానికి అవధులు లేవు. తన అభిరుచిని అర్థం చేసుకునే భర్త రావడం తన అదృష్టమని దీక్ష యాదవ్ చెబుతోంది. అన్నట్టు ఆ పదకొండు మంది పిల్లలకు కార్పొరేట్ పాఠశాలల్లో విద్యాభ్యాసాన్ని చేయిస్తూ ఉండడం దీక్ష యాదవ్ దంపతుల సేవా దృక్పథానికి నిదర్శనం గా నిలుస్తోంది.