Covid Booster Dose: కరోనా మహమ్మారి సృష్టించిన ఉన్మాదం అందరికి తెలిసిందే. ప్రపంచాన్ని గడగడలాడించిన వైరస్ ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. మనతోనే సహజీవనం చేస్తోంది. ఫలితంగా ఇంకా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. దీంతో కరోనా ఇక మనల్ని విడిచిపెట్టేదెప్పుడు అనే ఆందోళన అందరిలో వస్తోంది. ఇప్పటికే నాలుగు దశలుగా కరోనా ప్రజలను పట్టి పీడిస్తూనే ఉంది. వైరస్ ధాటికి ప్రజలు సమిధలయ్యారు. కొందరు ప్రాణాలే పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో మరోమారు ప్రజలపై పంజా విసిరేందుకు కరోనా కాచుకుని కూర్చుంది. దీంతో రోజువారి కేసులు పెరుగుతున్నాయి. ఫలితంగా ప్రజల్లో ఆందోళన మొదలైంది. మళ్లీ పరిస్థితి మొదటికొస్తుందా ఏమిటనే అనుమానాలు వస్తున్నాయి.

కరోనా మహమ్మారిని తరిమేందుకు రెండు డోసుల టీకాలు తీసుకున్నా బూస్టర్ డోసు కూడా తీసుకోవాలని చెబుతున్నారు. కానీ మొదటి రెండు డోసులు తీసుకునేందుకు ముందుకు వచ్చిన ప్రజలు బూస్టర్ డోసు తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. ఫలితంగా కేసుల సంఖ్య పెరుగుతోందని నిపుణులు సూచిస్తున్నారు. మొదటి రెండు డోసులు తీసుకోవడానికి భయపడని జనం ఇప్పుడెందుకు వెనకడుగు వేస్తున్నారు. ఉచితంగా బూస్టర్ డోసు వేస్తామన్నా ముందుకు రావడం లేదు. దీంతో వైద్యులు కూడా ప్రజలు ఎందుకు రావడం లేదని ఆలోచనలో పడిపోతున్నారు.
కరోనా నియంత్రణలో బూస్టర్ డోసు ప్రముఖ పాత్ర పోషిస్తుందని తెలిసినా ఎక్కువ మంది వేసుకోవడానికి ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రాణాలు కాపాడుకోవడంలో బూస్టర్ డోసు ముఖ్యమని తెలిసినా ఎందుకు ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావడం లేదు. వైద్యులు కూడా చెబుతూనే ఉన్నారు. బూస్టర్ డోసు వేసుకోండని కానీ ప్రజలు ఇంకా చైతన్యవంతులు కావడం లేదు. దీంతోనే వైరస్ పడగ విప్పుతోంది. కేసుల సంఖ్య పెరిగేందుకు కారణమవుతోంది.

హైదరాబాద్ లో సగటున రోజుకు 372 కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయని తెలుస్తోంది. కానీ బూస్టర్ డోసు వేసుకోవడానికి కనీసం 300 మంది కూడా రావడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది. బూస్టర్ డోసు వేసుకోవడానికి వెనకాడకుండా అందరు విధిగా వేసుకుని మహమ్మారిని తరిమికొట్టేందుకు తమ వంతు పాత్ర పోషించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రజలందరు బూస్టర్ డోసు వేసుకుని వైరస్ ఆనవాళ్లు కూడా లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పం. దీనికి అందరు సహకరించి కరోనాను మన దేశం నుంచి తరిమేయాలని భావిస్తోంది.