BCCI: టీ20 ప్రపంచ కప్ తరువాత బీసీసీఐ ప్రక్షాళన దిశగా కదులుతోంది. మొదట సెలెక్షన్ కమిటీపై వేటు వేసింది. ప్రస్తుతం ఆటగాళ్లపై దృష్టి సారించింది. పేలవ ప్రదర్శన చేసే వారిని సాగనంపేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా కొందరు ఆటగాళ్లను ఇంటికి పంపనుంది. జట్టుప్రయోజనాలే లక్ష్యంగా ముందడుగు వేస్తోంది. ఫామ్ లో లేని ఆటగాళ్లను పంపిస్తోంది. ఇంటికెళ్లే వారి జాబితాలో పలువురు సీనియర్లు ఉన్నట్లు సమాచారం. గత కొద్ది కాలంగా సీనియర్లు సరైన రీతిలో ఆడలేకపోతున్నారు.

తొలగిస్తున్న వారి జాబితాలో రిషబ్ పంత్, శిఖర్ ధావన్ ముందంజలో ఉన్నట్లు చెబుతున్నారు. వీరు ఏ ఫార్మాట్ లోనూ సరైన ఆట ఆడటం లేదు. ఇక వారిని భరించే సహనం యాజమాన్యానికి కనిపించడం లేదు. పంత్ కు అయితే ఎన్నో అవకాశాలు ఇచ్చినా తన ఫామ్ కొనసాగించలేకపోతున్నాడు. పైగా వయసు కూడా పైబడటంతో వారికి గుడ్ బై చెప్పనున్నారని వార్తలు వస్తున్నాయి. శిఖర్ ధావన్ కూడా వన్డేల్లో మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నా సరైన ఫామ్ కొనసాగించలేకపోతున్నాడు.
న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో ధావన్ 72 పరుగులు చేసి ఫామ్ లో ఉన్నట్లు కనిపించినా తరువాత పూర్వ స్థితినే కొనసాగించాడు. వరుసగా నాలుగు మ్యాచుల్లో తక్కువ స్కోరుకే పరిమితం అయ్యాడు. బంగ్లాదేశ్ తో జరిగిన మూడో వన్డేలో రోహిత్ స్థానంలో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేసి ఫర్వాలేదనిపించినా ఇషాన్ కిషన్ ను ఓపెనర్ గా బీసీసీఐ ఒప్పుకోవడం లేదు. ప్రస్తుతం బంగ్లాదేశ్ తో జరిగే టెస్టు మ్యాచులకు ఎవరిని ఓపెనర్ గా తీసుకుంటారనే దానిపై స్పష్టత లేదు. టెస్టు మ్యాచ్ రేపటి నుంచే ప్రారంభం అవుతుంది.

రిషబ్ పంత్ వైపు కూడా మొగ్గు చూపడం లేదు. పంత్ ఆటలో పస కనిపించడం లేదు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాడుకోవడం లేదు. అతడి స్థానంలో సంజు శాంసన్ కు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనే దాని మీద కూడా ఆలోచిస్తున్నారు. రెండు టెస్టుల సిరీస్ ను సొంతం చేసుకోవాలంటే కొందరిపై వేటు పడక తప్పదని భావిస్తోంది. ఇందులో భాగంగానే ప్రక్షాళన మొదలు పెట్టినట్లు సమాచారం. బంగ్లాదేశ్ ను టెస్టు సిరీస్ లోనైనా ఎదుర్కొని వన్డేల్లో పోయిన పరువును నిలబెట్టుకోవాలని బీసీసీఐ భావిస్తోంది.