Success: ఆచార్య చాణక్యుడు మనకు ఎన్నో విషయాలు చెప్పాడు. జీవితంలో మనం చేయకూడనివి, చేసేవి వివరంగా సూచించాడు. చాణక్య నీతి శాస్త్రంలో మనిషి ప్రవర్తన గురించి తనదైన శైలిలో రాశాడు. మనిషి ఏ సందర్బాల్లో ఎలా ఉండాలనే విషయాలు వివరణాత్మకంగా సూచించాడు. మనిషి చేయకూడని తప్పులను ఎత్తి చూపాడు. జీవితంలో ఎదగాలంటే ఏం చేయాలో కూడా చెప్పాడు.
లోపాలను చెప్పొద్దు
మనలో ఉన్న లోపాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులకు చెప్పొద్దు. ఎంత ప్రాణ స్నేహితుడైనా ఫర్వాలేదు కానీ మన గురించి మన రహస్యాలు పంచుకోకూడదు. అలా చెప్పినట్లయితే వాటి వల్ల ఎప్పుడో ఒకప్పుడు అవే మనకు ప్రతిబంధకాలుగా మారతాయి. దీంతో జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవడం సహజం. ఇలా మన రహస్యాలు ఇతరులతో పంచుకునే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి.
మూర్ఖునితో వాదించడం
అన్ని తెలిసిన వాడికి చెప్పొచ్చు. ఏమి తెలియని వాడికి వివరించొచ్చు. కానీ తెలిసీ తెలియని వాడితో వాదించడం కష్టం. అతడే మూర్ఖుడు. వాడు చెప్పిందే వేదం. వాడు పలికిందే సత్యం. లేదంటే మనకు తిప్పలు తప్పవు. అలాంటి వాడితో మనం తర్కిస్తే మనకు నష్టమే. అందుకే మూర్ఖులతో వాదం పెట్టుకుంటే మన మర్యాద పోవడం ఖాయం. దుష్టులకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం.
డబ్బు అధికంగా ఖర్చు చేయొద్దు
మనం సంపాదించే డబ్బును అధికంగా ఖర్చు చేయకూడదు. డబ్బు లేకపోతే సమాజంలో గౌరవం ఉండదు. నీచంగా చూస్తారు. అందుకే డబ్బు సంపాదించాలి. దాన్ని పొదుపు చేసుకోవాలి. అవసరమైన సందర్భాల్లో ఖర్చు చేయడం సహజమే. కానీ అనవసర ఖర్చులు పెట్టి సంపాదనను నాశనం చేసుకుంటే మనుగడ కష్టమవుతుంది.
అబద్ధాలు చెప్పొద్దు
ఎప్పుడు కూడా మోసాలు, అబద్ధాలు చెబుతూ పోతే వారిపై గౌరవం ఉండదు. వాడి మాటకు విలువ ఉండదు. దీని వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. జీవితంలో ఎప్పుడు అబద్ధాలు చెబుతుంటే వాడి ఉనికి ప్రశ్నార్థకమే అవుతుంది. దీంతో అబద్ధాలు చెప్పకూడదు. నిజాలు మాట్లాడితే మన మీద గౌరవం పెరుగుతుంది. నలుగురు మనతో మంచిగా ఉంటారు.
నైతిక నిబద్ధత
నైతిక విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలి. సమాజంలో బతుకున్నంత కాలం మంచి ప్రవర్తనతో ఉంటేనే మనల్ని ఎదుటివారు గౌరవిస్తారు. అభిమానిస్తారు. అంతేకాని మనం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఎవరు కూడా మన దగ్గరకు రారు. మనుషుల్లో మానవత్వం ఉండాలి. అదే మనల్ని మంచివాడిగా నిలబెడుతుంది. అది లేనివాడు జీవితంలో రాణించలేడు.