Gali Janardhan Reddy: కర్ణాటక ఎన్నికల ఫలితాలు దాదాపుగా వచ్చేసినట్టే. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ అవతరించింది. ఇక సీఎల్పీ మీటింగ్ తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనేది త్వరలో తేలుతుంది. ఆదివారం కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇందుకు సంబంధించి సమావేశం నిర్వహించనున్నారు. సరే ఇదంతా పక్కన పెడితే కర్ణాటక ఎన్నికల్లో చాలామంది దిగ్గజ ప్రముఖుల రాజకీయ జీవితాలు తారు మారయ్యాయి. అయితే ఈ జాబితాలో అధికార భారతీయ జనతా పార్టీ నాయకులే ఎక్కువగా ఉండడం విశేషం. అయితే ఈ ఎన్నికల్లో చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించిన క్యారెక్టర్ ఒకటి ఉంది. అతడే బళ్లారి మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి.
సొంత పార్టీ పెట్టాడు
భారతీయ జనతా పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత గాలి జనార్దన్ రెడ్డి కళ్యాణ కర్ణాటక ప్రగతి పార్టీ (కేఆర్ పీ పీ) పేరుతో ఒక రాజకీయ పార్టీ ప్రారంభించాడు. అంతేకాదు భారతీయ జనతా పార్టీ నాయకులకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. అయితే ఆయనకు ఎన్నికల్లో ఫుట్ బాల్ సింబల్ ను ఎన్నికల సంఘం కేటాయించింది. అయితే ఈ గుర్తు మీద పోటీ చేసిన ఆయన ఏకంగా ఎనిమిది వేల మెజారిటీతో గంగావతి నియోజకవర్గంలో గెలిచారు. ఈ గంగావతి ప్రాంతం ఒకప్పుడు నిజాం పాలనలో ఉండేది. హైదరాబాద్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉండేది. ఇక్కడ తెలుగు ఓటర్లు అధికంగా ఉండడంతో జనార్దన్ రెడ్డి గెలుపు సులభం అయింది.
ఒక ఆట ఆడుకున్నాడు
గాలి జనార్దన్ రెడ్డి ఆర్థికంగా చాలా స్థితిమంతుడు కావడంతో తాను పోటీ చేసిన గంగావతి నియోజవర్గంలో ఓటర్లను అనుకున్న దానికంటే ఎక్కువ సంతృప్తి పరచాడు. అంతేకాదు గంగావతి నియోజవర్గంలో తెలుగు వాళ్లను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేసాడు. ఆ ప్రయత్నాలు పలించి ఆయన విజయం సాధించాడు. ఇదే దశలో అటు భారతీయ జనతా పార్టీ, ఇటు కాంగ్రెస్, మధ్యలో జెడిఎస్ ను ఒక ఆట ఆడుకున్నాడు. ఇక ఈ నియోజవర్గంలో ఈ మూడు పార్టీలకు చెందిన దిగ్గజ నాయకులు పోటీలో నిలిచారు. వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ జనార్దన్ రెడ్డి విజయం సాధించారు. వాస్తవానికి ఈ మూడు పార్టీలు కూడా జనార్దన్ రెడ్డి రాజకీయ జీవితానికి చెక్ పెట్టాలని నిర్ణయించాయి. అయితే వారి కుట్రలు ముందే పసిగట్టి జనార్దన్ రెడ్డి విజయ డంకా మోగించాడు. అయితే తన పార్టీ మెరుగైన సీట్లు సాధిస్తే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తానని ప్రకటించాడు. అంతేకాదు సిద్ధరామయ్యతో చర్చలు కూడా జరిపాడు. అయితే కర్ణాటక ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని అధికారాన్ని ఇవ్వడంతో జనార్దన్ రెడ్డి అవసరం లేకుండా పోయింది. గాలి జనార్దన్ రెడ్డి సాధించిన విజయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈయన విజయాన్ని పురస్కరించుకొని ట్రోలర్స్ కొత్తవిధాలుగా మీమ్స్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.