Chanakya Neeti: తల్లిదండ్రులుగా మారడమే ఒక గొప్ప వరం. అప్పటి వరకు ఎలా ఉన్నా సరే తల్లిదండ్రిగా మారిన తర్వాత ఒక బాధ్యత అంటూ వస్తుంది. బాధ్యతగా మెలగాల్సిందే కూడా. ఇక తండ్రి బాధ్యత కూడా మరింత పెరుగుతుంది. అంతేకాదు మగపిల్లలకు తండ్రిగా మారితే మాత్రం కొన్ని తప్పులు అసలు చేయకూడదు అంటారు చాణక్యుడు. ఇంతకీ అవేంటి అనే వివరాలు ఓ సారి తెలుసుకుందాం.
మగ పిల్లల తండ్రులు అస్సలు చేయకూడని పొరపాట్లు కూడా వివరించారు చాణక్యుడు. అవి చేయడం వల్ల పిల్లల భవిష్యత్తు ప్రభావితం అవుతుందట. అందులో ముందుగా చెప్పాలంటే..కొడుకులను ఎవరి ముందు పొగడకూడదు అంటారు ఆచార్య చాణక్యుడు. మిమ్మల్ని మీరు పొగడటం ఎంత సరైంది కాదో, మీ కొడుకును పొగడటం కూడా అంతే సరైంది కాదు అంటారు. ఇలాంటి పని ఎప్పుడు కూడా చేయవద్దు అంటారు. సమాజంలో ఎంత మంచిగా ఉండాలో కచ్చితంగా మీ పుత్రరత్నాలకు నేర్పించాలట.
అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే..తమ కొడుకు అంత గొప్ప, ఇంత గొప్ప అని అందరి ముందు మాత్రం అస్సలు చెప్పకూడదు. అందరి ముందు కొడుకుని పొగడటం వల్ల తండ్రి హేళనకు గురికావడమే కాకుండా మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది కాబట్టి తండ్రి తన కొడుకును ఇతరుల ముందు పొగడడకుండా ఉండటమే బెటర్. మీ కొడుకు సద్గుణవంతుడు , గొప్పవాడు అయితే, అతని గురించి పది మందికి చాటింపు వేయాల్సిన అవసరమే లేదు. తను మంచి వాడు అయితే సమాజమే తెలుసుకుంటుంది.
గొప్పగా చెప్పకుండా వారిలో సద్గుణాలను ప్రపంచం గుర్తించేలా చేస్తే సరిపోతుంది అంటారు చాణక్యుడు. మీరు మీ కుమారునికి మంచి విలువలు నేర్పి, అతనిని సద్గురువుగా మార్చడంపై దృష్టి పెట్టాలి. తండ్రిగా ఈ కర్తవ్యం నిర్వహించాల్సిందే. అయితే.. మీరు మీ పిల్లలకు మంచి విషయాలు నేర్పించే సమయంలో.. వారిని తక్కువ చేసి మాట్లాడటం, వారిని కించపరిచి మాట్లాడటం వంటివి అసలు చేయకూడదు. ఇతరుల ముందు పొగడకూడదు అన్నారని వారిని తక్కువ చేసి మాట్లాడటం కూడా చాలా పెద్ద తప్పే. అందుకే మీ పిల్లల ముందు జాగ్రత్తగా ఉండండి..