Aarogyasri Services: ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని నెట్వర్క్ ఆసుపత్రులు అల్టిమేటం ఇచ్చాయి. దాదాపు 1500 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని.. వాటిని క్లియర్ చేస్తే కానీ సేవలందించలేమని ఆసుపత్రులు స్పష్టం చేయడం విశేషం. ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు వారికి ప్రజలతో పనిలేదు. ఓటర్ అంటే లెక్కలేదు. ఏమైనా అవకాశం ఉంటే అస్మదీయ కంపెనీలకు బిల్లులు చెల్లిస్తారు కానీ.. ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు చెల్లించే అవకాశం లేదు. కానీ సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ఈ అల్టిమేట్ జారీ చేయడం వ్యూహాత్మకమేనని తెలుస్తోంది.గత ఐదేళ్లుగా ఆరోగ్యశ్రీ బిల్లులు మొత్తాన్ని పెంచాలని నెట్వర్క్ ఆసుపత్రులు కోరాయి. ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా క్లియర్ చేయాలని విజ్ఞప్తి చేశాయి. కానీ ఎప్పుడు ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. అయినా సరే భయపెట్టడంతో నెట్వర్క్ ఆసుపత్రులు.. ఆందోళనను పక్కన పెడుతూ సేవలందిస్తూ వచ్చేవి.
ఎన్నికలకు ముందు బటన్ నొక్కుడు పథకాల కోసం పదివేల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేశారు. కానీ 10 పైసలు కూడా ఖాతాల్లో వేయలేదు. అదిగో చంద్రబాబు అడ్డుకుంటున్నారు.. ఇదిగో పవన్ అడ్డుకుంటున్నారు అంటూ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయలేదు. పోనీ పోలింగ్ తర్వాత అయినా ఒకరోజు నగదు జమ చేసే ఛాన్స్ వచ్చినా.. ఆ పని చేయలేదు. ఆ పని చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. పోలింగ్ తర్వాత ప్రజలతో అస్సలు పనిలేదు. అందుకే అస్మదీయ కంపెనీలకు బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. విపక్షాల విన్నపంతో గవర్నర్ కలుగజేసుకోవడంతో.. 14 వేల కోట్ల బటన్ నొక్కుడు నిధులకు గాను.. వందల కోట్లు మాత్రమే జమ అయ్యాయి. సంక్షేమ పథకాలకే దిక్కులేదు.. ఆరోగ్యశ్రీ సేవలు అంటే ప్రభుత్వం లెక్క చేస్తుందా? అన్నది ఇప్పుడు ప్రశ్న.
అయితే గత ఐదు సంవత్సరాలుగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు చాలాసార్లు ఆందోళనకు దిగాయి. సేవలు నిలిపివేస్తామని హెచ్చరించాయి. వాటిని ఎలా రూట్లో తెచ్చుకోవాలో జగన్ అంతలా తెచ్చుకున్నారు. పెండింగ్ బిల్లులు కొనసాగిస్తూనే వారితో సేవ చేయించుకున్నారు. ఈ ప్రభుత్వంతో పని కాదన్న నిర్ణయానికి నెట్వర్క్ ఆసుపత్రులు వచ్చేశాయి. అందుకే సరిగ్గా కౌంటింగ్ ముందు నెట్వర్క్ ఆసుపత్రులు సేవలు నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నాయి. కనీసం కొత్త ప్రభుత్వం అయినా తమ గోడును పరిగణలోకి తీసుకుంటుందన్న ఆశ వాటిలో ఉంది. తప్పకుండా ప్రభుత్వం మారుతుందన్న ఖచ్చితమైన అభిప్రాయానికి వచ్చిన తరువాతే.. అది ఆందోళన బాట పట్టినట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి.