AC Buying Guide: ఏప్రిల్ లోనే మే మాదిరి ఎండలు కొడుతున్నాయి. ఉదయం 10 దాటితే అడుగు బయటకు వేయాలంటే వెన్నులో వణుకు పుడుతోంది. దీనికి తోడు ఉక్క పోత.. ఫలితంగా ప్రజలు చుక్కలు చూస్తున్నారు. రాజస్థాన్ నుంచి మొదలు పెడితే తెలంగాణ వరకు ఇదే పరిస్థితి. మరోవైపు వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైన పని ఉంటేనే బయటికి వెళ్లాలని సూచనలు చేసింది. ఈ క్రమంలో మండే ఎండ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే కచ్చితంగా చల్లదనం అవసరం. అలాంటి చల్లదనం కోసం చాలామంది ఏసీలను ఆశ్రయిస్తారు. గతంలో స్తోమత ఉన్న వాళ్ళ ఇళ్లలోనే ఏసీలు ఉండేవి. కానీ ఇప్పుడు చాలామందిలో ఆర్థిక స్థిరత్వం పెరగడంతో ఏసీలను కొనుగోలు చేస్తున్నారు. ఏసీలను కొనుగోలు చేయడం వరకు ఓకే.. మరి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసా?
ఇవి కచ్చితంగా పాటించాలి
ఏసీ కొనుగోలు విషయంలో ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మీరు ఉంటున్న నివాసం లేదా గదికి తగ్గట్టుగా దానికి అనుకూలమైన ఏసీ కొనుగోలు చేయాలి. చిన్న పిల్లల గది, మాస్టర్ బెడ్ రూమ్, లివింగ్ రూమ్, ఇలా మీరు ఉండే ప్రదేశాన్ని బట్టి ఏసీ రకాన్ని నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు గది వైశాల్యం 120 చదరపు అడుగుల వరకు ఉంటే దానికి ఒక టన్ను కెపాసిటీ ఉన్న ఏసీ సరిపోతుంది. గది వైశాల్యం 120 నుంచి 200 చదరపు అడుగులు ఉంటే ఒకటి నుంచి రెండు టన్నులు.. లివింగ్ రూమ్ 200 చదరపు అడుగుల కంటే పెద్దగా ఉంటే రెండు టన్నులు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ఏసీ ని వాడాల్సి ఉంటుంది.
ఒకటే గదిలో ఉండేవారు..
ఒకటే గదిలో ఉండేవారు విండో ఏసీ ని ఎక్కువగా వాడుతుంటారు. విండో ఏసీలో అన్ని పరికరాలు ఒకే పెట్టెలో అమర్చి ఉంటాయి. దీనిని బిగించడం చాలా సులభం. కిటికీ లేదా గోడకు ఉండే ఓపెనింగ్ ఏరియాలో దీనిని బిగించవచ్చు. ధర తక్కువగానే ఉన్నప్పటికీ శబ్దం ఎక్కువగా వస్తుంది.
స్ప్లిట్ ఏసి
దీనికి తగ్గట్టుగానే ఈ ఏసీలో రెండు పరికరాలు వేరువేరుగా ఉంటాయి. ఒకదానిని ఇంట్లో బిగిస్తే.. మరొక దానిని వెలుపల అమర్చాల్సి ఉంటుంది. కంప్రెసర్ అనేది బయట ఏర్పాటు చేసే భాగంలో ఉంటుంది. అందువల్ల శబ్దం పెద్దగా రాదు. దీనిని బిగించడం కొంత శ్రమతో కూడుకున్నది.
హాట్ అండ్ కోల్డ్ ఏసీ
పేరుకు తగ్గట్టుగానే ఇది అన్ని రకాల వాతావరణ పరిస్థితులకు అనువుగా ఉంటుంది. వాతావరణంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు చల్లబరుస్తుంది. వాతావరణంలో చలి ఎక్కువగా ఉన్నప్పుడు వెచ్చదనాన్ని ఇస్తుంది.
పోర్టబుల్ ఏసీ
మన అవసరాలకు అనుగుణంగా దీనిని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు
టవర్ ఏసీ
పెద్ద గదులను, వాణిజ్య స్థలాలను వేగంగా చల్లబరిచేందుకు వీటిని ఉపయోగిస్తుంటారు.
ఇవి ఉండాల్సిందే
ఏసీలో కచ్చితంగా గాలిని శుద్ధి చేసే ఫిల్టర్లు ఉండాలి. అప్పుడే ఏసీలోకి ఎలాంటి దుమ్ము, ధూళి చేరదు. ఫలితంగా అలర్జీల వంటివి చెంతకు రాకుండా ఉంటాయి.
ఆటో క్లీన్ ఫీచర్ ఉన్న ఏసీని తీసుకోవడం వల్ల.. దానిని అదే శుభ్రం చేసుకుంటుంది. ఫలితంగా బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు వంటివి రాకుండా ఉంటాయి.
ఏసీలో ముఖ్యంగా డి హ్యుమిడిఫికేషన్ ఫీచర్ అనేది ఉండాలి. అప్పుడే గదిలో తేమ, తడి నిండిపోకుండా ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా స్మార్ట్ కనెక్టివిటీ, ఆటో స్టార్ట్, ఫోర్ వే స్వింగ్, టర్బో మోడ్, స్లీప్ అలారం, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ వంటి ఫీచర్స్ కూడా ఉండేలా చూసుకోవాలి.
చాలా కంపెనీలు చెబుతుంటాయి గాని అన్ని ఏసీల కెపాసిటీ ఒకే విధంగా ఉండదు. విద్యుత్ వినియోగం విషయంలోనూ చాలా తేడాలు ఉంటాయి. అందుకే స్టార్ రేటింగ్ ఉన్న ఏసీని మాత్రమే తీసుకోవాలి. ఒకే స్టార్ ఉన్న ఏసీ తో పోలిస్తే 4 లేదా 5 స్టార్స్ రేటింగ్ కలిగిన వాటిని ఎంచుకోవడం చాలా ఉత్తమం. దానివల్ల విద్యుత్ బిల్లు ఆదా అవుతుంది.
గది ఉష్ణోగ్రత ఆధారంగా..
ఇన్వర్టర్ ఏసీలో ఉండే కంప్రెసర్ గది వాతావరణంలో ఉన్న ఉష్ణోగ్రత ఆధారంగా పనిచేస్తుంది. ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు కంప్రెసర్ మీద ఒత్తిడి పడి అధికంగా పనిచేయాల్సి ఉంటుంది. గది చల్లగా ఉన్నప్పుడు దానిమీద భారం తక్కువగా పడుతుంది. దీనివల్ల విద్యుత్ వినియోగం కూడా చాలావరకు తగ్గుతుంది.