Buying A House : చాలామంది మధ్యతరగతి ప్రజలు సొంత ఇల్లును కట్టుకోవాలని కలలు కంటూ ఉంటారు. తమకలను కొందరు నెరవేర్చుకుంటే.. మరి కొందరు మాత్రం జీవితాంతం కష్టపడినా.. ఇల్లును పొందలేరు. అయితే ప్రస్తుత కాలంలో బ్యాంకు రుణాలతో పాటు ఇతర మార్గాల ద్వారా ఆదాయాలు రావడంతో సొంత ఇల్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఆదాయం వచ్చిన క్రమంలో సొంత ఇల్లు కొనే విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. ఇల్లు కొన్న తర్వాత.. తాము ఎందుకు కొన్నామా..? అన్న ఫీలింగ్ తో ఉంటున్నారు. అయితే ఈ ఇల్లు కొనే ముందే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ముఖ్యంగా ప్రణాళిక ప్రకారంగా సొంత ఇల్లును కొనుగోలు చేస్తే జీవితాంతం ఎలాంటి కష్టం లేకుండా ఉంటారు. అయితే సొంత ఇల్లు కొనుగోలు చేసే ముందు ఎలాంటి ప్రణాళిక వేసుకోవాలి? ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి?
Also Read : వినియోగదారులకు అలర్ట్: ఏప్రిల్ 1 నుంచి ఇవి పనిచేయవు..
అసలు ఎందుకు ఇల్లు?
సొంత ఇల్లు కొనుగోలు చేసే ముందు ఈ ప్రశ్న కచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే కొందరికి ఇదివరకే ఇల్లు ఉన్న పెట్టుబడిల కోసం మరో ఇల్లును కొనుగోలు చేయాలని చూస్తారు. ఈ క్రమంలో అప్పులు చేసి బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని ఇల్లును కొనుగోలు చేస్తారు. కానీ ఇలా పెట్టుబడుల కోసం ఇల్లును కొనుగోలు చేయడం అంత మంచిది కాదు. ఎందుకంటే ఇల్లు ఎప్పటికైనా తరుగుదల ఆస్తి మాత్రమే. కొన్ని సంవత్సరాల తర్వాత ఇల్లు ధర కొన్న దాని కంటే తక్కువ వేస్తుంది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అయితే సొంత ఇల్లు లేని వారు.. తనకు సొంతంగా ఇల్లు ఉండాలని కోరుకునే వారు మాత్రం కచ్చితంగా ఇల్లు కొనుగోలు చేయవచ్చు.
ఎక్కడ కొనుగోలు చేయాలి?
సొంత ఇల్లు కావాలన్నా ఆతృతతో కొంతమంది ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ కొనుగోలు చేస్తారు. కానీ అక్కడ సరైన వాతావరణం ఉందా? లేదా? అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. కొన్ని పారిశ్రామిక ఏరియాలో ఇల్లు కొనుగోలు చేయడం వల్ల ఇబ్బందిగా మారుతుంది. అలాగే పారిశుద్ధ్య లోపం ఉన్న ప్రాంతంలో ఇల్లు కొనుగోలు చేసిన వృధానే అవుతుంది. అందువల్ల ఇల్లు కొనుగోలు చేసే ముందు అక్కడి వాతావరణాన్ని పరిగణలోకి తీసుకోవాలి.
బడ్జెట్ పై ప్రణాళిక..
ఇల్లు కొనుగోలు చేసే ముందు బడ్జెట్ విషయంలో పగడ్బందీ ప్లాన్ ఉండాలి. అప్పు చేసి ఇల్లు కొనుగోలు చేసేవారు ఆ అప్పు తీర్చగలిగే శక్తి ఉందా? లేదా? అనే విషయాన్ని ఆలోచించుకోవాలి. ఎందుకంటే కొందరు ఆదాయానికి మించి ఆస్తులు కొనుగోలు చేయాలని చూస్తారు. ఇల్లు కొనుగోలు చేయడానికి చేసే అప్పును తీర్చడానికి సరైన ఆదాయం వస్తుందని అనుకున్నప్పుడే ఇల్లును కొనుగోలు చేయాలి. అప్పుడే ఎలాంటి భారం లేకుండా సొంత ఇంట్లో హాయిగా ఉండగలుగుతారు.
అద్దె వస్తుందా?
కొందరు ఇల్లు కొనుగోలు చేసి అద్దెకు ఇవ్వాలని చూస్తారు. అయితే వచ్చే అద్దె తీసుకున్న రుణం ఈఎంఐ కి సరిపోయే విధంగా ఉందా? అనేది ఆలోచించుకోవాలి. అలాగైతే ఈఎంఐ చేస్తూ సొంత ఇల్లును పొందగలుగుతారు. ఇలా సొంత ఇల్లు విషయంలో పగడ్బందీగా ప్రణాళికలు వేసుకున్న తర్వాతనే కొనుగోలు చేసేందుకు ముందడుగు వేయాలి.