BCCI Review Meeting: టీమిండియా అత్యుత్తమ కెప్టెన్లలో విరాట్ కోహ్లీ ఒకరు. అయినా సరే అతని హయాంలో ఒక్కటంటే ఒక్క మేజర్ ఐసీసీ టోర్నీ కూడా భారత జట్టు గెలవలేదు. సెమీ ఫైనల్స్ వరకూ దూసుకెళ్లి అక్కడ చతికిలపడటం భారత్‌కు అలవాటుగా మారింది. ఒక్క మ్యాచులో అలసత్వంతో అప్పటి వరకు పడిన కష్టాన్ని నేలపాలు చేసుకునేది. ఈ పరిస్థితిని గుర్తించిన కోహ్లీ కీలక ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేశారు. కీలక టోర్నీలకు ముందు తగిన విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐని కోరారు. కానీ ఆయన చూచనను ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆలస్యంగా తత్వం బోధపడిన బీసీసీఐ ఇప్పుడు కోహ్లీనే ఫాలో అవుతోంది.

ధోనీ కోసం కప్పు కొట్టాలని..
2019లో ఎంఎస్.ధోనీ తన కెరీర్‌లో చివరి వన్డే వరల్డ్ కప్ ఆడాడు. 2011లో సచిన్ కోసం ఎలాగైతే జట్టంతా ప్రాణం పెట్టి ఆడిందో.. అలాగే 2019లో ధోనీ కోసం కప్పు కొట్టాలని కోహ్లీ బలంగా నమ్మాడు. అందుకే చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. బీసీసీఐకి కూడా కొన్ని సూచనలు చేశాడు. వీటిలో భాగంగానే వన్డే వరల్డ్ కప్ ఆడే ఆటగాళ్లు, ముఖ్యంగా పేసర్లు ఐపీఎల్‌లో గాయాలపాలు అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అడిగాడు. వాళ్ల వర్క్‌లోడ్ మేనేజ్ చేయాలని, దీనిపై బీసీసీఐ కొంత ఫోకస్ పెట్టాలని సూచించాడు. అయితే అప్పట్లో అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ అండ్ కో ఈ మాటలను పెద్దగా పట్టించుకోలేదు. కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని ఫ్రాంచైజీలకు ఎలా చెప్తాం? అన్నట్లు కోహ్లీపై సీరియస్ అయ్యారు.
ఇప్పుడు అదే ఫాలో అవుతున్నారు..
నాడు కోహ్లీ సూచనను కాదన్న బీసీసీఐ ఇప్పుడు అదే నిర్ణయం తీసుకుంది. వరల్డ్ కప్ ఆడే ఆటగాళ్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పవని తేల్చి చెప్పింది. వీవీఎస్.లక్ష్మణ్ నేతృత్వంలోని ఎన్సీయే బృందం ఈ ఆటగాళ్లను మానిటర్ చేయాలని, ఐపీఎల్‌లో కూడా సదరు ఆటగాళ్లు గాయాలపాలు అవకుండా వర్క్‌లోడ్ మేనేజ్ చేసేలా ఫ్రాంచైజీలతో మాట్లాడాలని తేల్చిచెప్పింది. వన్డే వరల్డ్ కప్ కోసం మొత్తం 20 మంది ఆటగాళ్లను ఎంపిక చేశామని, వాళ్లంతా ఐపీఎల్‌లో మరీ ఎక్కువ స్ట్రెస్ అవకుండా చూసుకోవాలని నిర్ణయించింది.

బీసీసీఐ తాజా నిర్ణయం గురించి తెలుసుకున్న అభిమానులు కోహ్లీ డిమాండ్‌ను గుర్తు చేస్తూ నెట్టింట రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కోహ్లీ అడిగినప్పుడు ఛీ పో అన్న బీసీసీఐ.. ఇప్పుడు అదే పని చేస్తోందంటూ విమర్శిస్తున్నారు.