Rishab Pant : రిషబ్ పంత్.. భావి కెప్టెన్ అని అందరూ కీర్తిస్తున్న ప్లేయర్. అప్పట్లో ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించిన టీమిండియా టెస్ట్ జట్టులో కీలకమైన ఆటగాడిగా పేరుగాంచాడు. టెస్టును టీ20లా ఆడి ఆస్ట్రేలియాకు షాకిచ్చాడు. టీమిండియాను గెలిపించాడు. టెస్టుల్లో తప్పితే గత ఆసియాకప్, టీ20 ప్రపంచకప్ లో పెద్దగా ఆకట్టుకోలేదు. ఇటీవల బంగ్లాదేశ్, శ్రీలంక సిరీస్ లలోనూ పేలవ ఫామ్ తో చోటు కోల్పోయాడు.

ఆ దిగులులోనే ఇంటికి వెళుతూ ఇటీవల ఘోర రోడ్డుప్రమాదానికి గురై చావు అంచుల వరకూ వెళ్లాడు. ఓ బస్సు డ్రైవర్ కాపాడబట్టి సరిపోయింది లేదంటే ఈ అద్భుత క్రికెటర్ పరిస్థితి వేరేలా ఉండేది.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమిండియా క్రికెటర్ పంత్ విషయంలో బీసీసీఐ కూడా అలానే వదిలేయలేదు. ఈ క్రికెటర్ ను కడుపులో పెట్టుకొని చూసుకుంటోంది. అతడికి మంచి వైద్య సదుపాయం సహా ఆర్థికంగా నష్టపోకూడదని తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
వచ్చే ఆరేడు నెలలు పంత్ క్రికెట్ కు దూరమైనా సరే అతడి మొత్తం జీతం చెల్లించాలని బీసీసీఐ నిర్ణయించింది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కేటగిరీ-ఏలో ఉన్న పంత్ కు ఏటా రూ.5 కోట్లు జీతం రూపంలో అందనుంది. అటు ఐపీఎల్ లో పంత్ కు ఢిల్లీ క్యాపిటల్స్ కాంట్రాక్ట్ ఉంది.
ఇక ఐపీఎల్ 2023లో రిషబ్ పంత్ ఆడడం కష్టమే. ఇతడు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా ఉన్నాడు. అయినా సరే ఐపీఎల్ లో ఢిల్లీ తరుఫున ఆడకున్నా అతడి రెమ్యూనరేషన్ అయిన రూ.16 కోట్లు వేతనం చెల్లించాలని బీసీసీఐ ఫ్రాంచైజీకి ఆదేశించినట్లు సమాచారం. మొత్తంగా టీమిండియాలో కీలక ఆటగాడిగా ఉన్న పంత్ విషయంలో ప్రపంచంలోనే సంపన్న క్రికెట్ బోర్డు బీసీసీఐ తీసుకుంటున్న చొరవ..చర్యలు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇలానే ఆపదలో ఉన్న వారందరినీ బీసీసీఐ ఆదుకోవాలని అందరూ కోరుతున్నారు.