Adulterated petrol detection: వాహనం ఉన్న ప్రతి ఒక్కరూ పెట్రోల్ బంక్ లోకి వెళ్లక తప్పదు. గతంలో కంటే ఇప్పుడు పెట్రోల్ బంకులు ఎక్కువగా ఏర్పాటు అవుతున్నాయి. అంతేకాకుండా వివిధ కంపెనీలకు చెందిన పెట్రోల్ బంకులు దర్శనమిస్తున్నాయి. వాస్తవానికి పెట్రోల్ బంకుల్లో కల్తీ జరుగుతుందా? అంటే జరగదని చెప్పేవారు చాలా తక్కువ మందే ఉంటారు. ఎందుకంటే ఆహార పదార్థాల్లోనే కల్తీ జరుగుతుంది. పెట్రోల్ లో కల్తీ జరగదని ఎవరు చెప్పలేరు. అయితే పెట్రోల్‌లో కల్తీ ఉందా? లేదా? అనేది గుర్తించడం కష్టంగా ఉంటుంది. ఒకవేళ విజిలెన్స్ అధికారులు వచ్చే గుర్తిస్తే తప్ప ఆ పెట్రోల్ బంక్ లో కల్తీ ఉన్నది.. లేనిది తెలియదు. కానీ అంతా ప్రాసెస్ అవసరం లేకుండానే కల్తీ పెట్రోల్‌ను మనం మీటర్ రీడింగ్ చూస్తూ తెలుసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా పెట్రోల్ బైక్ లో లేదా కారులో పోసుకునేవారు మీటర్ రీడింగ్ పై చూస్తారు. లేదా ఇతరులతో మాట్లాడుతూ ఉంటారు. ఎక్కువమంది మీటర్ రీడింగ్ లోనే గ్యాంబ్లింగ్ చేసి పెట్రోల్‌ను తక్కువ లేదా ఎక్కువగా పోస్తారని అనుకుంటూ ఉంటారు. కానీ పెట్రోల్ మీటర్ రీడింగ్ లో మూడు బాక్సులు ఉంటాయి. ఇందులో ఒకటి పెట్రోల్ ధరను సూచిస్తుంది. మరొకటి మనం ఎంత పెట్రోల్ పోసుకుంటున్నాము దానిని సూచిస్తుంది. ఇక మూడో బాక్స్ లో Density ని సూచిస్తుంది. ఈ డెన్సిటీని చాలామంది పట్టించుకోరు. కానీ పెట్రోల్ లో కల్తీ ఉందా? లేదా? అనేది దీనిద్వారా తెలుసుకోవచ్చును.
పెట్రోల్ లో ఎలాంటి కల్తీ లేకుంటే డెన్సిటీ 0.730 నుంచి 0.780 ఉండాలి. ఇలా ఉంటే ఆ పెట్రోల్ లో ఎలాంటి కల్తీ లేదని అర్థం చేసుకోవాలి. అలాకాకుండా 0.730 కంటే తక్కువగా ఉన్నా.. లేదా 0.780 కంటే ఎక్కువగా ఉన్నా.. అందులో కల్తీ ఉందని అర్థం చేసుకోవాలి. అలాగే డీజిల్ లోను కల్తీని ఈ విధంగానే గుర్తించాలి. డీజిల్ లో డెన్సిటీ 0.820 నుంచి 0.860 వరకు ఉండాలి. వీటిలో 0.820 కంటే తగ్గినా.. 0.860 కంటే పెరిగినా.. అందులో కల్తీ ఉందని అర్థం చేసుకోవాలి.
పెట్రోల్‌లో ఎక్కువగా పామ్ ఆయిల్, ఇథనాల్ కలుపుతూ ఉంటారు. ఇలా వీటిని కలపడం వల్ల పెట్రోల్ లో వీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో పెట్రోల్ కల్తీగా మారిపోతుంది. ఇలా కల్తీ అయిపోయిన పెట్రోల్ వాడటం వల్ల ఇంజన్ పవర్ తగ్గిపోతుంది. అంతేకాకుండా లాంగ్ డ్రైవ్ వెళ్లినప్పుడు ఒకేసారి ఆగిపోతుంది. అందువల్ల ముందుగానే ఈ విషయాన్ని బాగా పరిశీలించి పెట్రోల్ కల్తీ అయిందో లేదో గుర్తించుకోవాలి. ఒకవేళ ఒక బంకులో పెట్రోల్ కల్తీ అయినట్లు గుర్తిస్తే మరోసారి ఆ బంకుకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. లేదా ఒక అడుగు ముందుకు వేసి ఆ పెట్రోల్ బంకుపై ఫిర్యాదు చేయవచ్చు.