Prabhas next project: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) బాహుబలి సిరీస్ తర్వాత ఎలాంటి స్పాన్ ఉన్న సినిమాలు చేస్తూ వెళ్తున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ, టాక్ తో సంబంధం లేకుండా రికార్డు స్థాయి గ్రాస్ వసూళ్లను రాబడుతూ ఇండియా లోనే నెంబర్ 1 స్టార్ గా కొనసాగుతున్నాడు. అయితే ఆసక్తిని కలిగించే విషయం ఏమిటంటే, బాహుబలి తర్వాత ప్రభాస్ కొత్త డైరెక్టర్స్ కి ఎక్కువగా అవకాశాలు ఇస్తూ వచ్చాడు కానీ, స్టార్ డైరెక్టర్స్ తో చేసిన సినిమాలు మాత్రం చాలా తక్కువ. ఒక్క ప్రశాంత్ నీల్ తో తప్ప మిగిలిన అందరూ చిన్న వారే. త్వరలోనే సందీప్ వంగ లాంటి స్టార్ డైరెక్టర్ తో కలిసి పని చేయబోతున్నాడు. ఈ సినిమాకు ఎలాంటి హైప్ ఉంటుందో మీ ఊహలకే వదిలేస్తున్నాం. ఇదే కాసేపు పక్కన పెడితే ప్రభాస్ ఇప్పుడు మరో చిన్న డైరెక్టర్ తో పని చేయడానికి సిద్ధం అవుతున్నాడట.
చిన్న డైరెక్టర్ అయినా పర్వాలేదు, యంగ్ డైరెక్టర్ అయితే చాలు, సరికొత్త ఆలోచనలతో నేటి తరం ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా సినిమా చేస్తాడని తృప్తి పడొచ్చు. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆ ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆయన నటించబోయేది ఒక కొరియోగ్రాఫర్ మొదటి చిత్రం లో కాబట్టి. వివరాల్లోకి వెళ్తే రాజమౌళి ఆస్థాన కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ త్వరలోనే ప్రభాస్ ని హీరో గా పెట్టి ఒక సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. నాటు నాటు లాంటి ఆస్కార్ అవార్డు విన్నింగ్ పాటకు కొరియోగ్రఫీ అందించిన ప్రేమ్ రక్షిత్ ఇక మీదట ఎక్కువగా దర్శకత్వం వైపే ఫోకస్ పెట్టాలని చూస్తున్నాడట. అందుకు తగ్గట్టుగానే ఏకంగా ప్రభాస్ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ కొట్టేసాడు. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అనుభవం లేని వాడితో పని చేయడం ఎందుకు అంటూ పెదవి విరుస్తున్నారు.
ప్రస్తుతం నువ్వు ఇండియా లోనే నెంబర్ 1 హీరోవి, నువ్వు కోరితే పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్స్ కూడా నీ ముందుకు వచ్చి నిల్చుంటారు. అలాంటి నువ్వు ఇలాంటి డైరెక్టర్స్ కి అవకాశం ఇచ్చి కెరీర్ ని రిస్క్ లో పెట్టొద్దు. కొత్త డైరెక్టర్స్ ని నమ్మడం వల్ల బాహుబలి తర్వాత చేసిన మూడు సినిమాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి, ఇప్పుడే ట్రాక్ లోకి వచ్చావు, మళ్లీ ఫ్లాప్ ట్రాక్ లోకి వెళ్లొద్దు అంటూ అభిమానులు ప్రాధేయపడుతున్నారు. అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే, ప్రేమ్ రక్షిత్ దర్శకత్వం వహించబోయేది ఒక యానిమేషన్ సినిమా అని, అందులో ప్రభాస్ క్యారక్టర్ కూడా ఉంటుందని, ఆయన పాత్రకు డబ్బింగ్ మాత్రమే చెప్తాడని అంటున్నారు. ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.