Maldakal Lakshmi Venkateswara Swamy: తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఒక్కసారైనా దర్శించుకోవాలని ప్రతి తెలుగు కుటుంబం కోరుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏడాదికి ఒక్కసారైనా ఇక్కడికి విహారయాత్రకు రావాలని అనుకుంటారు. స్వామివారి దర్శనం చేసుకుంటే తమ జన్మ ధన్యం అని భావిస్తారు. దేశంలోనే కాకుండా విదేశాల నుంచి కూడా ప్రత్యేకంగా శ్రీవారిని దర్శించుకోవడానికి తరలి వస్తుంటారు. అయితే తెలంగాణలోని జోగులాంబ జిల్లాలోని ఒక గ్రామ ప్రజలు మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళమని అంటున్నారట. మరి వారు ఎందుకు వెళ్ళమని అంటున్నారు? అక్కడ ఏమైనా ఆలయం ఉందా?
జోగులాంబ జిల్లాలోని మల్దకల్ గ్రామం గురించి ప్రత్యేకంగా చర్చ సాగుతోంది. ఈ గ్రామంలో ఒకప్పుడు ఏకశిలతో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పటినుంచి ఇక్కడికి భక్తుల తాకిడి రోజు రోజుకు పెరిగిపోతుంది. పురాతన కాలం నుంచే ఆచార, సాంప్రదాయాలను పాటిస్తూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా డిసెంబర్ నెలలో వచ్చే పౌర్ణమి రోజున తిరునాళ్లు నిర్వహిస్తారు. వందల ఏళ్ల కింద ఈ గ్రామంలో కరువు కాటకాలు రావడంతో ఇక్కడ ప్రజలు తమ బాధలు తీర్చాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలిచారట. అయితే ఒక వృద్ధుడి కలలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రూపంలో వచ్చి ఆలయం కడితే సమస్యలు తీరుతాయని చెప్పాడట. ఆ తర్వాత గ్రామం అంతా కలిసికట్టుగా ఆలయం నిర్మించారు. అప్పటినుంచి గ్రామ ప్రజలు సుఖశాంతులతో ఉంటున్నారు. గ్రామంలోని పాడిపంటలు కూడా సమృద్ధిగా పండుతూ అధిక ఆదాయాన్ని పొందుతున్నారు.
అయితే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామినే తమ గ్రామంలో నిలిచారని.. అందువల్ల ఈ స్వామినే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిగా భావిస్తామని ఈ గ్రామ ప్రజలు అంటున్నారు. అందువల్ల వీరు తిరుమల శ్రీవారి దర్శనం కంటే ఇక్కడి స్వామి వారి దర్శనం ఎక్కువగా చేసుకుంటామని అంటున్నారు. అంతేకాకుండా ఈ స్వామివారిని దర్శించుకుని కోరికలు కోరుకుంటే వెంటనే నెరవేరుతాయని ఇక్కడి గ్రామస్తులు అంటున్నారు. ఈ విషయం మిగతా గ్రామాల్లో కూడా పాకడంతో ఇతర గ్రామాల నుంచి ఇక్కడికి ప్రజలు తరలివస్తున్నారు.
ప్రతి ఏడాది ఈ ఆలయంలో శ్రీవారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో స్వామివారిని ఊరేగిస్తూ ఉంటారు. వివిధ వాహనాలపై స్వామివారు దర్శనం ఇచ్చి భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంగా ఇక్కడ గ్రామస్తులు ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్న ఈ స్వామిని తిమ్మప్ప అని కూడా అంటారు.