Snoring Problem: చాలా మందికి వెన్నంటుకుంటూనే కన్నంటుకుంటుంది. దీంతో గురక మొదలవుతుంది. గురక వల్ల పక్కనున్న వారికి ఇబ్బందే. సరిగా నిద్ర పట్టదు. గురక చప్పుడుకు చెవులు మూసుకోవాల్సిందే. గురక వల్ల ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. రాత్రుళ్లు మొత్తం గురక శబ్దంత ఇల్లంతా చప్పుడుగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో గురక ఎందుకు వస్తుంది? అది రావడానికి కారణాలేంటి? దాన్ని అదుపు చేసుకునే అవకాశం ఉందా? అనే కోణంలో ఆలోచిస్తే గురక జబ్బేమీ కాదని వైద్యులు చెబుతున్నారు. అదో అలవాటు మాత్రమే. దాని నుంచి రక్షించుకునే క్రమంలో చర్యలు తీసుకుంటే గురక నుంచి దూరం కావచ్చనే చెబుతున్నారు.

నిద్ర పోయే సమయంలో గాలి ముక్కు నుంచి కాకుండా ఊపిరితిత్తుల్లోకి వెళ్లే మార్గంలో అడ్డంకులు ఏర్పడినప్పడు గురక వస్తుంది. ఆ సమయంలో నోటి ద్వారా మాత్రమే శ్వాస తీసుకుంటాం. ఆ మార్గంలో అవాంతరాలుండటం వల్ల కుంచించుకుపోయిన మార్గం నుంచి గాలి వెళ్లాల్సి వస్తుంది. దీంతో చుట్టుపక్కల ఉన్న కణజాలాలు కదలికలకు గురైనప్పుడు చప్పుళ్లు వస్తాయి. ఈ కారణంగా గురక వస్తుంది. గురక రావడానికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడి, కంగారు, మన ఆలోచనా ధోరణి కూడా ఉంటోందని చెబుతున్నారు.
మధ్య వయసు ఆపై వయసుకు వచ్చిన వారికి గొంతు సన్నబడుతుంది. దీంతో గురక రావడానికి అవకాశాలు ఉన్నాయి. మహిళలకన్నా పురుషుల్లోనే గురక సమస్య ఎక్కువగా ఉంటుంది. వాయు నాళాలు తక్కువ వ్యాకోచంతో ఉంటాయి. అధిక బరువు కూడా గురకకు ఓ కారణమని చెబుతున్నారు. మెడ, గొంతు భాగంలో బరువు ఏర్పడినా గురక వస్తుంది. సైనస్ సమస్యలో నాసికా కుహరాలు జామ్ కామ్ కావడం వల్ల కూడా గురక సమస్య వస్తుంది. మద్యం తాగడం, ధూమపానం వంటి అలవాట్లతో కూడా గురక రావడానికి పరోక్షంగా కారణాలవుతాయి.

గురకను తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయి. ప్రతి రోజు నిద్ర పోయే ముందు పచ్చి అటుకులు తింటే గురక రాదు. అర టీ స్పూన్ తేనె, అర టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇంకా ఒక గ్లాస్ నీటిలో ఒకటి లేదా రెండు పిప్పర్ మెంట్ ఆయిల్ చుక్కలు వేసి రాత్రి నిద్ర పోయే ముందు నోటిలో వేసుకుని పుక్కిలిస్తే ఫలితం ఉంటుంది. ఒక గ్లాస్ నీటిలో అర టీ స్పూన్ యాలకుల చూర్ణం కలిపి రాత్రి నిద్ర పోయే ముందు తాగి నిద్ర పోతే ప్రయోజనం ఉంటుంది. రాత్రి పడుకునే ముందు మరిగే నీటిలో 4, 5 చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి పడితే మేలు కలుగుతుంది.