Gautam Adani: గౌతం అదానీ.. దేశంలో పారిశ్రామిక దిగ్గజాల్లో ఒకరు. ఇటీవల ఈయన తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఈయన ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో మూడోస్థానంలో నిలిచారు. అదానీ కంటే ముందు ఇలాన్ మస్క్, చెఫ్ బెజెస్ ఉన్నారు. అదానీ ఆస్తుల విలువ రూ.10.9 లక్షల కోట్లు. ఇది భారతదేశానికి గర్వకారణమే అయినా.. ఆయన ఆర్థిక వృద్ధిరేటు దేశంలో ఏ పారిశ్రామిక వేత్త సాధించని విధంగా ఉంది. దాదాపు భారత ఆర్థిక వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకునే స్థాయికి ఎదిగారు.

ఆరు నెలల్లో ఆరు లక్షల కోట్లు పెరుగుదల..
గౌతం అదానీ ఆస్తులు కేవలం ఆరు నెలల్లోనే 6.60 లక్షల కోట్లు పెరిగింది. ఇది నిజంగా ఆశ్చర్యం. గత ఫిబ్రవరి వరకు అదానీ ఆస్తుల విలువ 4.30 లక్షల కోట్లు. ఆరు నెలల్లో ఇంత భారీగా సంపద పెరుగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అదానీ తన ఆర్థిక వృద్ధిరేటు రహస్యం దేశానికి చెబితే ఇండియా ఆరు నెలల్లో ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా నిలుస్తుంది. అదానీ ఆస్తులు ఇంతలా ఎలా పెరిగాయన్న చర్చ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోంది.
2014 వరకు ఎవరికీ తెలియని అదానీ..
గుజరాత్‌కు చెందిన గౌతం అదానీ గురించి 2014 వరకు ఎవరికీ తెలియదు. కేవలం ఐదారేళ్లలోనే ఆయన భారీగా అనేక రంగాల్లోకి వచ్చారు. ఎయిర్ పోర్టు, సీపోర్టు, కోల్, పవర్, అల్యుమినియం, సిమెంట్‌తోపాటు తాజాగా మీడియారంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. 5జీ నెట్‌వర్క్ రంగంలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. 4 ఏళ్ల క్రితం ఎయిర్‌పోర్టు రంగంలో అదానీ లేరు. కానీ ప్రస్తుతం భారత్‌కు వచ్చే విమాన ప్రయాణికుల్లో 25 శాతం అదానీ పోర్టులోనే దిగుతున్నారు.
రాజకీయ సాన్నిహిత్యంతోనే..
అదాని వృద్ధి ఎలా సాధ్యమైందన్నదానికి ప్రధాన ఆరోపణ రాజకీయ సాన్నిహిత్యం. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతోనే అదానీ కనీవిని ఎరుగని రీతిలో ఆర్థిక వృద్ధి సాధిస్తున్నట్లు ఆరోపణులు ఉన్నాయి. ఇండియాలో కాకుండా శ్రీలంకలోనూ ఆరోపణలు వచ్చాయి. అక్కడ ఒక పోర్టు, పవర్ ప్లాంటును అదానీ దక్కించుకున్నారు. వీటిని టెండర్ లేకుండా శ్రీలంక ప్రభుత్వం కేటాయించింది. ప్రధాని నరేంద్రమోదీ ఒత్తిడితోనే ఇవి దక్కాయని అక్కడి అధికారి ప్రకటించారు. తర్వాత ఉపసంహరించుకున్నాడు. కానీ ఇప్పటికీ దీనిపై మన దేశంలో విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.
బలవంతంగా ముంబయ్ ఎయిర్‌పోర్టు అదానీ చేతికి..
నవీ ముంబయ్ ఎయిర్ పోర్టు కూడా 4 ఏళ్ల క్రితం అదానీ చేతికి వచ్చింది. దీని కోసం ఆయన జీవీకేపై కేంద్రం ద్వారా సీబీఐతో దాడి చేయించారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా అప్పటి వరకు ఎయిర్‌పోర్టు రంగంలో ఎలాంటి అనుభవం లేకున్నా.. ఆర్థిక శాఖ నిబంధనలు, నీతిఅయోగ్‌నిబంధనలు పక్కనపెట్టి భారత ప్రభుత్వం ముంబయ్ ఎయిర్‌పోర్టు దక్కేలా చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం ఎయిర్ పోర్టులోనూ పది శాతం వాటా అదానీ తీసుకున్నాడు. అక్కడి ప్రభుత్వం 10 వేల ఎకరాల భూములు ఇచ్చినందుకు ఈ పది శాతం వాటా దక్కింది. దీనిపై కన్నేసిన అధాని పది వేల కోట్ల విలువ చేసే 10 శాతం ప్రభుత్వ వాటాను కేవలం 600 కోట్లకే కొనుగోలు చేశాడు. దీని వెనుక కూడా రాజకీయ ఒత్తిడి ఉందన్న ఆరోపణలు ఉన్నాయి.

అప్పులతో వ్యాపార సామ్రాజ్య విస్తరణ..
అదానీ ఆస్తుల వృద్ధి రాజకీయ సాన్నిహిత్యంతో జరుగుతున్నాయని ఇన్నాళ్లూ ఆరోపణలు ఉన్నాయి. బలవంతంగా కొన్ని ఆస్తులు కూడబెట్టుకున్నట్లు విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆస్తుల వృద్ధికి మరో అంశం కారణమనే విషయం వెలుగులోకి వచ్చింది. స్విచ్ అనే రేటింగ్ ఏజెన్సీకి సబంధించిన క్రెడిట్ సైట్స్ అనే సంస్థ అదానీ ఆస్తుల గురించి ఒక పెద్ద బాంబు పేల్చింది. అదానీ కంపెనీలు భారీగా విస్తరిస్తున్నాయి. అయితే ఇవి సొంత పెట్టుబడితో విస్తరించడం లేదని తెలిపింది. బ్యాంకుల ద్వారా భారీగా రుణాలు తీసుకుని అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తోందని పేర్కొంది. దీనిని బ్యాంకింగ్ పరిభాషలో ఓవర్ లిబరేట్ అంటారు. సాధారణంగా కంపెనీ పెట్టినప్పుడు సొంత పెట్టుబడితోపాటు బ్యాంకు రుణం తీసుకుంటారు. కానీ అదానీ అలా చేయకుండా బ్యాంకుల రుణాలతోనే వ్యాపారం విస్తరిస్తున్నట్లు తెలిసింది. దీని ద్వారా కంపెనీలు నష్టాల్లో కూరుకుపోతే రుణాల భారం పెద్ద ఎత్తున బ్యాంకులపై పడుతుందని హెచ్చరించింది. ఇది చాలా ప్రమాదకరమని స్పష్టం చేసింది.
రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్న బ్యాంకులు
సాధారణంగా సామాన్యుడు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే కొత్త రుణం ఇవ్వడానికి బ్యాంకులు వెనుకాడుతాయి. కానీ అదానీ విషయంలో బ్యాంకులు అలా చేయడం లేదు. ఎంత రుణమైనా ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. పాత రుణాలు తీర్చకపోయినా ఎస్‌బీఐ వేల కోట్ల రూపాయల కొత్త రుణం ఇస్తోంది. భారీగా ఇప్పటికే అదానీకి అప్పులు ఉన్నాయి. అయినా రాజకీయ ప్రోద్బలంతోనే బ్యాంకులు మరిన్ని రుణాలు ఇచ్చేందకు ముందుకు వస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆరోపణలు ఎదుర్కొనేందుకు మీడియా రంగంలోని..
అదానీ కంపెనీలపై వచ్చే ఆరోపణలు అడ్డుకునేందుకు, ప్రతి విమర్శలు చేసేందుకు అదానీ మీడియారంగంలకి కూడా కొంటున్నారు. గతంలో మీడియా ఉన్నా.. తాజాగా దేశంలో ప్రముఖ మీడియా సంస్ధ ఎన్‌డీటీవీలో 26 శాతం వాటా కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. ఇక ఎవరైనా స్వతంత్ర జర్నలిస్టులు అదానీ కంపెనీలపై వార్తలు, కథనాలు రాస్తే వారిపై పరువు నష్టం దావా వేసి ఎదుర్కొవాలని అదానీ చూస్తున్నారు. ఇలా అదాని తన వ్యాపార సామ్రాజ్యం విస్తరించుకుంటూ ప్రపంచంలో మూడో సంపన్నుడుగా ఎదగడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Also Read:Pawan Kalyan First Movie: హీరో కాకపోతే పవన్ చేద్దామనుకున్న పని అదే!