New Year 2024: వచ్చింది వెలుగుల వసంతం.. కొత్త ఏడాదిలోకి సరికొత్తగా అడుగు..!

మన జీవితంలో జరిగిన, జరుగుతున్న ప్రతీ క్షణం అద్భుతమే. అస్వాదించడమే మన పని. వాస్తవంగా చూస్తే తేదీనే మారుతుంది.

Written By: Neelambaram, Updated On : January 1, 2024 1:29 pm
Follow us on

New Year 2024: కరిగిపోయిన కాలం ఓ జ్ఞాపకం.. నడుస్తున్న కాలం అద్భుతం. కాలగమనంలో మరో ఏడాది కరిగిపోయింది. 2023 వెళ్లిపోయి.. 2024 వచ్చేసింది. పాత ఏడాదిలోని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటే.. ఆరోజు ఎంతో అద్భుతమైనదిగా, అది మళ్లీ వస్తే బాగుండు అనిపిస్తుంది. కానీ, రాబోయే రోజుల్లో అంతకన్నా మధురమైన రోజులు కూడా రావొచ్చు. అలా వచ్చేలా మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి. పాత జ్ఞాపకాలను, అనుభవాలను పునాదిగా మార్చుకుని, కొత్త ఆశలు, ఆకాంక్షలతో కొత్త ఏడాదిలో ముందుకు సాగిపోవాలి. అప్పుడు పాత మధుర జ్ఞాపకాలను మించిన రోజు మన జీవితంలో తప్పక వస్తుంది.

జరిగింది అద్భుతమే.. జరుగ బోయేది..
మన జీవితంలో జరిగిన, జరుగుతున్న ప్రతీ క్షణం అద్భుతమే. అస్వాదించడమే మన పని. వాస్తవంగా చూస్తే తేదీనే మారుతుంది. కరిగిపోయిన ఒక్క క్షణం కూడా తిరిగి వెనక్కి రాదు. కానీ ఉన్న క్షణాన్ని సద్వినియోగం చేసుకునే చాయిస్‌ మాత్రం మన చేతుల్లోనే ఉంది. మనం బాగుంటే.. మన కుటుంబం బాగుంటుంది. మనం కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటే దేశం బాగుపడుతుంది. అందుకే ఎవరినో బాగు చేయడానికి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకుండా.. మన కుటుంబాన్ని మనమే ఆనందమయంగా చేసుకోవాలి. ఏ అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలుసుకుంటే.. కొత్త ఏడాది కూడా సాఫీగా సాగిపోతుంది.

లక్ష్యంవైపు పయనిస్తే..
ఇక ప్రతి ఒక్కరికీ లక్ష్యాలు ఉంటాయి. కొత్త ఏడాదిలో అయినా వాటిని సాధించాలని అనుకుంటారు. బైక్‌ లేని వాళ్లు బైక్‌ కొనుక్కోవాలనుకుంటారు.. ఉద్యోగం లేని వాళ్లు ఉద్యోగం సంపాదించుకోవాలనుకుంటారు. అవి ఉన్న వాళ్లు అంత కంటే పెద్దది మరో గోల్‌ పెట్టుకుంటారు. ఎలాంటి గోల్‌ అయినా పెట్టుకోవచ్చు.. ప్రయత్నించి అందుకోవడంలోనే మజా ఉంటుంది. కష్టపడితే.. కష్టపడిన మార్గంలోనే కాకుండా.. చాలా మార్గాల్లో విజయం దరి చేసే అవకాశం ఉంటుంది.

జీవిత సత్యం తెలుసుకుంటే..
కొత్త ఏడాదిని మరింత కొత్తగా మన జీవితంలోకి ఆహ్వానించాలంటే ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. జీవితానికి ఏది ముఖ్యమని, చాలా మంది డబ్బే ముఖ్యమనుకుంటారు. డబ్బే ముఖ్యమైతే ఆర్థిక సమస్యలు లేని వాళ్లు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు. డబ్బు కూడా ముఖ్యం. కానీ డబ్బే ముఖ్యం కాదు. డబ్బుకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చి.. ఇతర జీవితాన్ని సాఫీగా సాగేలా బ్యాలెన్స్‌ చేసుకుంటే 2024 హ్యాపీగా నడిచిపోతుంది.