Homeలైఫ్ స్టైల్Google search safety tips: గూగుల్ లో ఈ 5 టైప్ చేస్తే డేంజర్లో...

Google search safety tips: గూగుల్ లో ఈ 5 టైప్ చేస్తే డేంజర్లో పడ్డట్లే..

Google search safety tips: ప్రస్తుత రోజుల్లో ఇంటర్నెట్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. ఏ సమాచారం కావాలన్నా క్షణాల్లో గూగుల్‌లో వెతికి తెలుసుకుంటున్నాం. అయితే కొన్ని రకాల సమాచారాన్ని నిర్లక్ష్యంగా వెతకడం లేదా నమ్మడం వల్ల సైబర్ మోసాలు, ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత డేటా చోరీ వంటి ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఐదు అంశాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వాటి వివరాల్లోకి వెళితె..

1. కస్టమర్ కేర్ నంబర్ల కోసం గూగుల్ సెర్చ్:
బ్యాంకులు, ఈ-కామర్స్ సంస్థలు లేదా ఇతర సేవలకు సంబంధించిన కస్టమర్ కేర్ నంబర్ల కోసం చాలామంది గూగుల్‌లో వెతుకుతుంటారు. అయితే సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్లు, ఫేక్ నంబర్లను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తుంటారు. ఆ నంబర్లకు కాల్ చేసిన తర్వాత OTPలు, బ్యాంక్ వివరాలు, డెబిట్ కార్డు సమాచారం అడిగి ఖాతాల్లోని డబ్బును దోచుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఎప్పుడూ అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే కస్టమర్ కేర్ నంబర్లను పొందాలి.

2. ఫ్రీ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్లు:
‘ఫ్రీ వెర్షన్’, ‘క్రాక్ సాఫ్ట్‌వేర్’, ‘ప్రీమియం సాఫ్ట్‌వేర్ ఉచితం’ వంటి సెర్చ్‌లకు ఆకర్షితులవడం ప్రమాదకరం. ఇలాంటి లింకుల ద్వారా డౌన్‌లోడ్ చేసే ఫైళ్లలో వైరస్‌లు, మాల్వేర్ లేదా స్పైవేర్ దాగి ఉండే అవకాశం ఉంది. ఒకసారి కంప్యూటర్ లేదా మొబైల్‌లోకి ప్రవేశించిన తర్వాత అవి వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డ్‌లు, బ్యాంకింగ్ వివరాలను దొంగిలించవచ్చు. కాబట్టి ఎప్పుడూ అధికారిక వెబ్‌సైట్లు లేదా విశ్వసనీయ యాప్ స్టోర్ల నుంచే సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేయాలి.

3. స్వీయ వైద్యం కోసం:
చిన్న అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే గూగుల్‌లో సెర్చ్ చేసి తామే వ్యాధిని నిర్ధారించుకోవడం చాలా మంది అలవాటుగా మార్చుకున్నారు. అయితే ఒకే లక్షణం అనేక వ్యాధులకు సూచన కావచ్చు. ఇంటర్నెట్‌లో చదివిన సమాచారం ఆధారంగా మందులు వాడటం లేదా చికిత్స చేయించుకోవడం ప్రమాదకర పరిణామాలకు దారితీయొచ్చు. కొన్ని సందర్భాల్లో సరైన వైద్య చికిత్స ఆలస్యం కావడం వల్ల ప్రాణాపాయం కూడా ఏర్పడే అవకాశం ఉంది.

4. ఈజీగా డబ్బు సంపాదించే మార్గాలు:
‘రోజుకు లక్షలు సంపాదించండి’, ‘ఇంట్లో నుంచే భారీ ఆదాయం’, ‘ఒక్క క్లిక్‌తో డబ్బు’ వంటి ప్రకటనలు తరచూ కనిపిస్తుంటాయి. వీటిలో చాలా వరకు మోసపూరిత పథకాలు, నకిలీ పెట్టుబడి అవకాశాలు లేదా ఫిషింగ్ స్కామ్‌లు కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. త్వరగా సంపాదించాలనే ఆశతో వ్యక్తిగత వివరాలు లేదా డబ్బు చెల్లిస్తే భారీ నష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

5. వ్యక్తిగత సమాచారం కోసం సెర్చ్‌లు
తమ ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లు లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్‌లో వెతకడం కూడా ప్రమాదకరం. కొన్ని వెబ్‌సైట్లు ఈ వివరాలను పొందేందుకు మోసపూరిత ఫారమ్‌లు, నకిలీ లాగిన్ పేజీలను ఉపయోగిస్తాయి. ఒక్కసారి వివరాలు అందిస్తే హ్యాకర్లు వాటిని దుర్వినియోగం చేసి ఆర్థిక మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుంది.

ఇంటర్నెట్ ఉపయోగించే ప్రతి ఒక్కరూ అధికారిక వెబ్‌సైట్లు మాత్రమే సందర్శించడం, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకపోవడం, OTPలు లేదా పాస్‌వర్డ్‌లను ఎవరికీ చెప్పకపోవడం, యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రెండు దశల భద్రత (Two-Factor Authentication)ను యాక్టివేట్ చేసుకోవడం మంచిది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version