Nara Lokesh: మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ కు భారీగా విదేశీ పెట్టుబడులను తీసుకురావాలన్న లక్ష్యంతో నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లారు. అనుకున్న లక్ష్యం మేరకు ఆయన భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇది నిజంగా శుభ పరిణామం. రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఆహ్వానం మేరకు ఆరు రోజుల పర్యటన నిమిత్తం లోకేష్ వెళ్లారు. ఆ దేశ రాజధాని సీయోల్ లో అడుగు పెట్టారు. గ్లోబల్ టెక్నాలజీ, ఆటోమొబైల్, సిటీ కండక్టర్ దిగ్గజాలతో వరుసగా భేటీ అవుతూ వస్తున్నారు లోకేష్. పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అనుకూల వాతావరణాన్ని వారికి వివరిస్తున్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ గా మార్చేందుకు ఆయన గట్టి ప్రయత్నం లోనే ఉన్నారు.
* కీలక భేటీ..
మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మంగళవారం అత్యంత కీలక భేటీ జరిగింది. ఆటోమోటివ్ టెక్నాలజీ దిగ్గజం హుండాయ్ మోబీస్ టాప్ ఎగ్జిక్యూటివ్ లతో లోకేష్ చర్చలు జరిపారు. ఏపీలో ఎలక్ట్రిక్ వెహికల్ ఎకో సిస్టం బలోపేతం చేసేలా.. అనంతపురం లేదా తిరుపతి పరిధిలో ఒక మెగా ఈవి సెమీ కండక్టర్ హబ్ తో పాటు బ్యాటరీ సిస్టమ్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని.. లోకేష్ హ్యుందాయ్ ప్రతినిధులను కోరారు. గతంలో ఏపీలో కియా మోటార్స్ సాధించిన అద్భుత విజయమే కొరియన్ సంస్థలకు ఒక బెంచ్ మార్గాన్ని గుర్తు చేశారు. అనంతపురం జిల్లాను దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దేందుకు భాగస్వామ్యం కావాలని కోరారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించారు.
* ఈసారి వాటికి ప్రాధాన్యం.
ఈసారి ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ రంగానికి ప్రాధాన్యమిస్తూ పెట్టుబడులను సాధించాలని లోకేష్ భావించారు. అందుకే ఈ పర్యటనలో ఎల్జి ఎలక్ట్రానిక్స్, సీయోల్ సెమీ కండక్టర్స్, APACT సంస్థల అధినేతలతో లోకేష్ ఈ విషయమై చర్చించారు. శ్రీ సిటీ కేంద్రంగా ఎల్జీ కంపెనీ 5000 కోట్ల భారీ ఇన్వెస్ట్మెంట్తో ఏర్పాటు చేయబోతున్న ప్లాంట్ పనులపై కూడా చర్చించారు. విశాఖలో అంతర్జాతీయ స్థాయి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని లోకేష్ ఎల్జి ప్రతినిధులను కోరారు. దాదాపు 468 కోట్ల రూపాయల వ్యయంతో ఏపీలో సెమీ కండక్టర్ అసెంబ్లీ, ప్యాకేజింగ్, టెస్టింగ్ కేంద్రాన్ని నిర్మిస్తున్న అపాక్ట్ సంస్థతో మాట్లాడి.. రాబోయే రోజుల్లో ఏపీ యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేలా స్కిల్ డెవలప్మెంట్ అకాడమీతో ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రతిపాదించారు.
* ఫుట్వేర్ రంగానికి సైతం..
మరోవైపు స్మార్ట్ హెల్త్ కేర్ ఫుట్వేర్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న షూ అల్స్ సంస్థ ప్రతినిధులతో లోకేష్ కీలక చర్చలు జరిపారు. ఏపీలో ప్రతిపాదిత 300 కోట్ల రూపాయల ఫుట్వేర్ ప్రాజెక్టు వేగవంతం చేయాలని కోరారు. దీంతో మూడు వేల మంది స్థానిక యువతకు ఉపాధి లభించనుంది. మొత్తానికి అయితే లోకేష్ దక్షిణ కొరియా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. వేలకోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.
