YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక విషయంలో చాలా గర్వపడుతూ వస్తోంది. తాము ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చామని గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది. కానీ మొన్నటి ఎన్నికల్లో ఓటమితో ఆ పార్టీకి అసలు సినిమా అర్థమయింది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తే ఇబ్బందికరమని ఆ పార్టీ భావిస్తోంది. అలాగని ఆ పార్టీతో కలిసివచ్చే పార్టీలు లేవు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి స్వయంకృతాపం. అధికారంలో ఉన్నప్పుడు ఒక్క పార్టీతో కూడా చెలిమి లేదు. అసలు ఇతర రాజకీయ పార్టీలను లెక్క చేసేవారు కాదు. ఇప్పుడు అదే ఆ పార్టీకి మైనస్. ఆ పార్టీతో జత కలిసేందుకు ఏ పార్టీ ముందుకు రాని పరిస్థితి. అయితే ఇప్పుడు వామపక్షాల్లో ఒకటైన సిపిఐ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో జత కలుస్తోంది. కానీ అది ప్రభుత్వంపై పోరాటం చేసే క్రమంలో. ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శించే క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అనుసరిస్తోంది సిపిఐ. తాజాగా జోసెఫ్ రావణ్ అరెస్ట్ విషయంలో స్పందించారు సిపిఐ నారాయణ. ప్రభుత్వ చర్యలను తప్పుపడుతున్నారు. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో సిపిఐ జతకలుస్తుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
* ఉనికి ప్రశ్నార్ధకం..
దేశవ్యాప్తంగా వామపక్షాలు ఉనికిని కోల్పోయాయి. చివరకు కేరళలో సైతం ఆ పార్టీ చేతులెత్తేసింది. కానీ ఇప్పటికీ ప్రజా సంఘాల రూపాల్లో వామపక్షాలు బలంగా ఉన్నాయి. అయితే వామపక్షాల అవసరం అధికార పార్టీలకంటే ప్రతిపక్షాలకి ఎక్కువగా ఉంటుంది. క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు చేయాలంటే వామపక్షాల అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇంకా రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఉండడంతో కచ్చితంగా ప్రజా పోరాటాలు చేయాల్సి ఉంటుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అందుకే వామపక్షాలను కలుపు కెళ్తే మంచి ప్రయోజనం ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని తక్కువ సీట్లు విడిచిపెట్టిన అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లాభం అని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
* కూటమికి ధీటుగా..
వచ్చే ఎన్నికల్లో ఆ మూడు పార్టీలు కూటమిగా ముందుకు వెళ్లడం ఖాయం. మరో 15 ఏళ్ల పాటు కలిసి ఉంటామని పవన్ కళ్యాణ్ తేల్చి చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరాటం చేస్తే మాత్రం ఆ పార్టీకి ఇబ్బందికరమే. మొన్నటి ఎన్నికల వరకు ఒక ఎత్తు.. అంతకు ముందు పరిస్థితి వేరు.. మునుపటి మాదిరిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరించలేదు. ఆపై చాలా వర్గాలు దూరమయ్యాయి. తనకున్న సంప్రదాయ ఓటు బ్యాంకుకు తోడు వామపక్షాల బలం లభిస్తే మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం ఉంటుంది. లేకుంటే కష్టం అన్న టాక్ ఉంది. ముఖ్యంగా సిపిఐ లాంటి పార్టీతో దూకుడుగా ముందుకు సాగితే కొన్ని జిల్లాల్లో ప్రభావం చూపవచ్చు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదానికి సంబంధించి మంత్రి నారా లోకేష్ ను నిలదీసింది సిపిఐ నేతలు. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో సైతం సీపీఐ నేతలు కనిపించారు. అందుకే సిపిఐ తో వైసీపీ పొత్తు ఉంటుందన్న అనుమానం వ్యక్తం అవుతోంది. మరి జగన్ మనసులో ఏముందో తెలియాలి.
