CM Jagan
CM Jagan: గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏపీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పొలిటికల్ హీట్ నెలకొంది. అన్ని పార్టీల నేతలు ఎన్నికల ప్రచార పర్వంలో అడుగుపెట్టారు. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు వైసిపి పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. భారీగా నగదు అభ్యర్థులకు ఇప్పటికే చేరిపోయింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు వందల కోట్ల రూపాయలు చేరాయని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా భారీ కంటైనర్ తో సొమ్ము వచ్చిందని ప్రచారం జరుగుతోంది.ఇదో వైరల్ అంశంగా మారిపోయింది.
గత ఎన్నికల్లో సైతం భారీగా డబ్బు ప్రవాహం పెరిగింది. నాడు అధికారపక్షంగా ఉన్న టిడిపి కంటే విపక్షంలో ఉన్న వైసిపి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టిందన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో టిడిపి కేంద్ర ప్రభుత్వాన్ని విభేదించి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. దీంతో ఆ ఎన్నికల్లో జగన్ కు కేంద్రం అన్ని విధాలా సహకరించింది. అదే సమయంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ కూడా తన వంతు సహకారం అందించారు. అప్పట్లో 1000 కోట్ల రూపాయలు సమకూర్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. అప్పట్లో ఎలక్షన్ క్యాంపెయిన్ లో జగన్ చాకచక్యమే భారీ విజయాన్ని తెచ్చిపెట్టిందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే తరహాలో.. ఎలక్షన్ క్యాంపెయినింగ్ జగన్ నిర్వహిస్తున్నారని.. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు నగదు భారీగా తరలించారని విపక్ష నేతలు అనుమానించడంతో పాటు ఆరోపిస్తున్నారు.
ఇటీవల తరచూ నారా లోకేష్ కాన్వాయ్ ను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. వాహనాలను ఆపి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీనిపై స్పందించిన నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ ను టార్గెట్ చేసుకొని సంచలన కామెంట్స్ చేశారు. రోజు తన కాన్వాయ్ తనిఖీ చేసిన పోలీసులకు ఒక్క ఎన్నికల నిబంధన ఉల్లంఘన అయినా కనిపించిందా? అంటూ ప్రశ్నించారు.సీఎం ఇంట్లోకి అన్ని నిబంధనలు అతిక్రమించి వెళ్లి వచ్చిన కంటైనర్ను ఎందుకు తనిఖీ చేయలేదు? అని పోలీస్ అధికారులను నిలదీశారు. అందులో ఏముంది? బ్రెజిల్ సరుకుందా? లిక్కర్లో మెక్కిన వేలకోట్లు ఉన్నాయా? లండన్ పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నారా? లేకుంటే ఏపీ సెక్రటేరియట్లో ఇన్నాళ్లు దాచిన దొంగ ఫైళ్లా? అంటూ నారా లోకేష్ నిలదీశారు. దీనిపై రాష్ట్ర డిజిపి సమాధానం చెప్పాలని ట్విట్ చేశారు.
అయితే నారా లోకేష్ కొత్తగా ఈ కంటైనర్ వ్యవహారం వెలుగులోకి తేవడంతో చర్చనీయాంశంగా మారింది. విపక్షాలకు ఇదో ప్రచార అస్త్రంగా మారనుంది. జగన్ డబ్బులతో గెలవాలని చూస్తున్నారని విపక్షాలు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇటువంటి సమయంలోనే కంటైనర్ తో డబ్బు వచ్చిందని అర్థం వచ్చేలా లోకేష్ ఆరోపణలు చేశారు. మరోవైపు వైసీపీ గుర్తుతో పోలిన ఆకర్షణీయమైన వస్తువులు ఎక్కడికక్కడే పట్టుబడుతున్నాయి. అటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వాలంటీర్లు, వైసిపి అస్మదీయ ఉద్యోగులపై వేటుపడుతోంది. అయితే నారా లోకేష్ వ్యూహాత్మకంగా ఈ కామెంట్స్ చేశారా? లేకుంటే నిజంగానేసీఎం ఇంటికి కంటైనర్ వచ్చిందా? మరి లోకేష్ రాష్ట్ర డిజిపిని నిలదీసినంత పని ఎందుకు చేశారు? దీని వెనుక ఉన్న వ్యవహారం ఏంటి? అన్నది తెలియాల్సి ఉంది.