క్రికెట్లో ఎన్ని పరుగులు చేశామన్నది కాదు.. ఎలా ఆడాం.. ఏ స్థాయిలో ఆడమన్నది ముఖ్యం.. అయితే ఈ ఉపోద్ఘాతానికి కొంతమంది మాత్రమే సరిపోలుతారు. అటువంటి వారిలో వాషింగ్టన్ సుందర్ ముందు వరుసలో ఉంటాడు. ఎందుకంటే అతడు బౌలింగ్ చేస్తాడు. మిస్టీరియస్ బంతులు వేసి వికెట్లు పడగొడతాడు. అదే సమయంలో బ్యాటింగ్ చేస్తాడు. ఊహించిన విధంగా షాట్లు కొట్టి ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తాడు. అందువల్లే అతడిని మోస్ట్ డేంజరస్ బ్యాటర్ అని పిలుస్తారు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 టి20 మ్యాచ్లో సిరీస్ లో వాషింగ్టన్ సుందర్ కు జట్టులో అవకాశం లభించింది. వాస్తవానికి రెండో మ్యాచ్ లో అతడికి అవకాశం లభిస్తుందని అందరూ అనుకున్నారు. గౌతమ్ గంభీర్ చేసిన ప్రయోగం వల్ల అతడు జట్టుకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే అతడిని జట్టుకు దూరంగా పెట్టడం ఎంతటి తెలివి తక్కువ నిర్ణయమో గౌతమ్ గంభీర్ కు అనతి కాలంలోనే అర్థమైంది. దీంతో అతడు మూడవ టి20 మ్యాచ్ లో సుందర్ కు అవకాశం కల్పించాడు. వచ్చిన అవకాశాన్ని సుందర్ అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు. ఏకంగా 49 పరుగులు చేసి టీమిండియా విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. తన వ్యక్తిగత రికార్డును పక్కనపెట్టి.. జట్టు విజయం కోసం ఆడాడు. అందువల్లే టీమిండియా భారీ టార్గెట్ సైతం ఫినిష్ చేసింది.
వాషింగ్టన్ సుందర్ ఆస్ట్రేలియా మీదనే కాకుండా.. ఈ ఏడాది ఇంగ్లాండ్ జట్టు పై కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఐదు టెస్టు మ్యాచ్లో సిరీస్ లో వాషింగ్టన్ సుందర్ దుమ్మురేపాడు. ముఖ్యంగా ఐదవ టెస్టు మ్యాచ్లో వేగంగా బ్యాటింగ్ చేసి సంచలనం సృష్టించాడు. ఇప్పటికే ఆ టెస్ట్ సిరీస్ లో టీమిండియా 1-2 వెనుకబడి ఉంది. ఈ క్రమంలో చివరిదైనా ఐదో టెస్టులో టీమిండియా కచ్చితంగా విజయం సాధించాలి. ఆ సమయంలో రెండవ ఇన్నింగ్స్ లో వాషింగ్టన్ సుందర్ అదరగొట్టాడు. 46 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 53 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజాతో 34, ప్రసిద్ కృష్ణతో 39 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పి.. టీమిండియా 367 పరుగులు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఉత్కంఠ భరితంగా పోరాడి ఆరు పరుగుల తేడాతో ఇంగ్లాండు జట్టుపై గెలిచిన విషయం తెలిసిందే. వాస్తవానికి వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ చేయడం వల్ల టీమిండియా ఆ స్కోర్ చేయగలిగింది.