Virat Kohli : విరాట్ కోహ్లీ గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే ప్రతిరోజు అతడు కొత్తగానే కనిపిస్తాడు. ఎన్ని సెంచరీలు చేసినప్పటికీ.. టీమిండియాకు ఎన్ని విజయాలు అందించినప్పటికీ.. అతడు ఇంకా అలసిపోలేదు. ఆకలి గొన్న బెబ్బులి మాదిరిగా పోరాటం చేస్తూనే ఉన్నాడు. బ్యాటింగ్ లో, ఫీల్డింగ్ లో, చేజింగ్ లో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతూనే ఉన్నాడు.
విరాట్ కోహ్లీ తాజాగా జరిగిన న్యూజిలాండ్ సిరీస్ లో ఏకంగా ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ చేశాడు. తద్వారా టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతకుముందు జరిగిన దక్షిణాఫ్రికా సిరీస్ లోనూ విరాట్ కోహ్లీ ఇదే స్థాయిలో బ్యాటింగ్ చేశాడు. ఏకంగా వరుసగా రెండు సెంచరీలు చేసి తన సత్తా చూపించాడు. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మూడో వన్డేలో హర్షిత్ రాణా ఔట్ అవకుండా ఉండి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. టీమిండియా కు ఇంకో విధమైన ఫలితం వచ్చేది. టీమిండియా ఓటమికి అనేక కారణాలు దోహదం చేశాయి. న్యూజిలాండ్ జట్టు విజేతగా నిలవడానికి ప్రధాన కారణం మాత్రం డారిల్ మిచెల్. అతడు ఈ టోర్నీలో ఏకంగా రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ చేశాడు.
మిచెల్ సెంచరీ తో న్యూజిలాండ్ జట్టు భారీ స్కోర్ చేసింది. అయితే ఈస్కోరును చేజ్ చేయడంలో టీమిండియా విఫలమైంది. విరాట్ కోహ్లీ సెంచరీ చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. టీమ్ ఇండియా ఓటమి తర్వాత న్యూజిలాండ్ జట్టు సగర్వంగా ట్రోఫీని అందుకుంది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ ఒక మంచి పని చేశాడు. తాను ధరించిన జెర్సీని న్యూజిలాండ్ జట్టు ఆటగాడు మిచెల్ కోరిక మేరకు అందించాడు. దానిని అతనికి కానుకగా ఇచ్చాడు. ఈ విషయాన్ని మిచెల్ గొప్పగా చెప్పుకున్నాడు.
విరాట్ కోహ్లీ ఇప్పుడు మాత్రమే కాదు గతంలో కూడా ఇలాంటి పనులు చేశాడు. కొంతమంది క్రీడాకారులకు తన బ్యాట్లు.. జెర్సీలు కానుకగా అందించాడు. వారి ముచ్చట తీర్చాడు. అంతేకాదు, మైదానంలో అప్పుడప్పుడు ప్రత్యర్థి జట్టు ప్లేయర్ల షు లేసులు కూడా కట్టాడు విరాట్ కోహ్లీ. మైదానంలో ఎంత ఆవేశంగా ఉంటాడో.. అదే స్థాయిలో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తాడు విరాట్ కోహ్లీ.
