Homeవార్త విశ్లేషణTheenmar Mallanna : తీన్మార్ మల్లన్న ఎంపీ టికెట్ ఇస్తారా?

Theenmar Mallanna : తీన్మార్ మల్లన్న ఎంపీ టికెట్ ఇస్తారా?

Theenmar Mallanna : పార‍్లమెంటు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలై వారం దాటింది. ఏప్రిల్‌ 18న తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటనపై దృష్టిపెట్టాయి. బీజేపీ 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ముందు వరుసలో ఉండగా, బీఆర్‌ఎస్‌ కూడా 15 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. అధికార కాంగ్రెస్‌ మాత్రం అభ్యర్థుల ప్రకటనపై మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటి వరకు 9 మందికి టికెట్లు కేటాయించింది. నేడో రేపో మిగతా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

– కరీంనగర్‌పై అందరి దృష్టి..

పోరాటాల గడ్డ కరీంనగర్‌. బీఆర్‌ఎస్‌కు కంచుకోట. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఉమ్మడి జిల్లాలో 8 స్థానాల్లో విజయం సాధించింది. 5 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ గెలిచింది. ఇక కరీంనగర్‌ ఎంపీ ప్రస్తుతం బీజేపీ ఖాతాలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల జోష్‌ను పార్లమెంటు ఎన్నికల్లోనూ కొనసాగించాలని భావిస్తున్న కాంగ్రెస్‌ బలమైన అభ్యర్థి కోసం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రేసులో అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, వెలిచాల రాజేందర్‌రావు, తీన్మార్‌ మల్లన్న(చింతపండు నవీన్‌) ఉన్నారు. కాంగ్రెస్‌ అధిష్టానం తీన్మార్‌ మల్లన‍్నవైపు మొగ్గు చూపుతోంది. అయితే స్థానిక ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.

రాజేందర్‌రావుకు మద్దతు..

తీన్మార్‌ మల్లన్నకు దాదాపు టికెట్‌ ఖరారు అయినట్లు ప్రచారం జరుగడంతో పార‍్లమెంటు పరిధిలోని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మార్చి 26న సమావేశమయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆధ్వర్యంలో ఆది శ్రీనివాస్‌, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంతోపాటు ముగ్గురు ఇన్‌చార్జీలు పురుమల్ల శ్రీనివాస్‌, వొడితల ప్రణవ్, కేకే మహేందర్‌రెడ్డి సమావేశమై.. అభ్యర్థిత్వం చర్చించారు. ఏకాభిప్రాయం వచ్చాక జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. వీరంతా మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు తనయుడు వెలిచాల రాజేందర్‌రావుకు మద్దతు తెలిపారు. ఈ విషయాన్ని ఉత‍్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తర్వత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలిశారు. రాజేందర్‌రావుకే కరీంనగర్‌ టికెట్‌ ఇవ్వాలని కోరారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డిని కూడా కలిసి ఇదే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కరీంనగర్‌లో వెలమలు ఎక్కువగా ఉన్నందున వెలిచాలకు టికెట్‌ ఇవ్వాలని కోరారు.

రాజేందర్‌ కాకుంటే మల్లన్నకు..

రేవంత్‌ దృష్టిలో తీన్మార్‌ మల్లన్న ఉన్నారు. అయితే స్థానికుడు కాదనే అభిప్రాయం ఉంటుందని మల్లన్నను స్థానిక ఎమ్మెల్యేలు కాదంటున్నారని సమాచారం. స్థానికుడు అయిన రాజేందర్‌రావుకు టికెట్‌ ఇస్తే గెలుస్తాడని జిల్లా నాయకులు సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు. రాజేందర్‌రావు పేరును అధిష్టానానికి ప్రతిపాదించాలని కోరారు. అధిష్టానం కాదన్న పక్షంలో తీన్మార్‌ మల్లన్నకు టికెట్‌ ఇవ్వాలని పేర్కొన్నట్లు తెలిసింది.

మొత్తంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలు వెలిచార రాజేందర్‌రావు అభ్యర్థిత్వానికే మద్దతు తెలిపిన నేపథ్యంలో కాంగ్రెస్‌ అధిష్టానం పునరాలోచనలో పడినట్లు తెలిసింది. మొదట ప్రవీణ్‌రెడ్డి పేరును అధిష్టానం ప్రతిపాదించింది. తర్వాత తీన్మార్‌ మల్లన్నను తెరపైకి తెచ్చారు. చివరకు రాజేందర్‌రావుకే అంతా మొగ్గు చూపడం గమనార్హం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular