Homeవార్త విశ్లేషణBRS MLC Kavitha: తీహార్ జైల్లో.. కవిత కోరుకున్న సౌకర్యాల చిట్టా ఇది..

BRS MLC Kavitha: తీహార్ జైల్లో.. కవిత కోరుకున్న సౌకర్యాల చిట్టా ఇది..

BRS MLC Kavitha: ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ ఆ మధ్య రాసిన లేఖలో “వెల్ కమ్ టూ తీహార్ జైల్ కవితక్కా” అని పేర్కొన్నాడు. దానిని తన న్యాయమూర్తి ద్వారా మీడియాకు విడుదల చేశాడు. అతడు చెప్పినట్టుగానే మంగళవారం కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ కోర్టు తోసి పుచ్చింది. దీంతో కవిత సుఖేష్ చెప్పినట్టే తీహార్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కవిత బెయిల్ విచారణ సందర్భంగా కోర్టు ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం తరపున న్యాయవాది వాదనలతో ఏకీభవించింది. కవితను 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ కు తరలిస్తూ నిర్ణయం తీసుకుంది.. దీంతో ఒక్కసారిగా భారత రాష్ట్ర సమితి నాయకుల్లో నిరాశ ఆలముకుంది. కవిత తరఫున న్యాయవాదులకు కూడా ఈ తీర్పు రుచించలేదు. కోర్టు ఆదేశాల మేరకు కవిత తీహార్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను అరెస్టు చేసినప్పటికీ.. గత పది రోజుల నుంచి ఆమెను వారు తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు. జైలుకు పంపించలేదు. ఆమెను ఎన్ ఫోర్స్ కార్యాలయంలోని ప్రత్యేక గదిలో ప్రశ్నించారు.

మంగళవారం కోర్టు కవితకు వ్యతిరేకంగా తీర్పునివ్వడంతో ఆమె తీహార్ జైలుకు వెళ్లాల్సిన అనివార్యత ఏర్పడింది. వాస్తవానికి వీవీఐపీ ఖైదీలు జైలుకు వెళ్తున్నప్పుడు తమకు కల్పించాల్సిన సౌకర్యాలను న్యాయమూర్తి అనుమతితో ఏర్పాటు చేయించుకోవచ్చు. అయితే ఇందుకయ్యే ఖర్చును ఖైదీ భరించాల్సి ఉంటుంది. మంగళవారం విచారణ సందర్భంగా తనకు బెయిల్ రాకపోవడంతో.. తీహార్ జైలుకు వెళ్లే ముందు కవిత కోర్టులో మరో పిటిషన్ వేశారు. తనకు కావలసిన వస్తువులు, కల్పించాల్సిన సౌకర్యాల జాబితాను ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే కవిత పేర్కొన్న ఆ వస్తువుల జాబితాలో బంగారు ఆభరణాలు కూడా ఉండడం చర్చనీయాంశంగా మారింది. మామూలుగా అయితే పొలిటికల్ ఖైదీలు తమకు ప్రత్యేక వసతులు కావాలని అడుగుతారు. దీనిని కోర్టు పరిభాషలో హోదా అంటారు. ఈ హోదా ప్రకారం ఇంటి నుంచి భోజనం, మెత్తటి పరుపు, వార్తాపత్రికలు, పుస్తకాలు, కొన్ని సందర్భాల్లో టీవీ వంటి సౌకర్యం కూడా అందుబాటులోకి వస్తుంది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు.. ఏసీ ఏర్పాటు చేయాలని కోరారు. ఆయన వాదనతో కోర్టు ఏకీభవించింది కూడా.

అయితే ఎమ్మెల్సీ కవిత విషయంలో ఏసీ లాంటి సౌకర్యం కల్పించాలని అడగలేదు కానీ.. తన ఇంటి నుంచి ఆహారం, మెత్తటి పరుపు, బెడ్ షీట్స్, కాళ్లకు వేసుకోవడానికి స్లిప్పర్లు, పుస్తకాలు, దుప్పట్లు, పెన్ను, పేపర్లు, మందులు, బంగారు ఆభరణాలు కావాలని ఆమె అడిగారు. అయితే ఎటువంటి బంగారు ఆభరణాలు కావాలో ఆమె ఆ జాబితాలో స్పష్టం చేయలేదు. జైల్లో ఉన్న ఖైదీల ఒంటిమీద ఎలాంటి ఆభరణాలు ఉండేందుకు అవకాశం లేదు. కానీ మహిళలు తాళిబొట్టు, చెవులకు బుట్టలు వంటి కొన్ని సాంప్రదాయ ఆభరణాలు ధరిస్తారు. వాటిని తీసేసేందుకు ఒప్పుకోరు. అయితే కవిత ఈ ఆభరణాలను జైలులో డిపాజిట్ చేయకుండా.. తన ఒంటి మీదనే ఉంచుకునే విధంగా కోర్టు అనుమతి అడిగినట్లు తెలుస్తోంది. సాధారణంగా అయితే నెక్లెస్ లు, ఇతర హారాలు వేసుకుంటామని అడిగితే.. కోర్టు అంగీకరించే పరిస్థితి ఉండదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version