https://oktelugu.com/

BRS Leaders : వేదిక పైనే ఇలా తిట్టుకుంటున్న గులాబీ నేతలు.. నాయకులకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ లోక్ సభ స్థానానికి సంబంధించి మంగళవారం భారత రాష్ట్ర సమితి కార్యాలయం తెలంగాణ భవన్ లో సమావేశ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. ఆయన హాజరయ్యే కంటే ముందు భారత రాష్ట్ర సమితి నాయకులు మాట్లాడారు. అయితే ఈ వేదిక మీద భారత రాష్ట్ర సమితి నాయకుల మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి.

Written By: , Updated On : March 26, 2024 / 10:42 PM IST
Follow us on

BRS Leaders : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి.. మెజారిటీ మునిసిపాలిటీలలో మారిన నాయకత్వం.. కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు.. కాళేశ్వరం నుంచి ఫోన్ ట్యాపింగ్ దాకా ఇబ్బంది పెడుతున్న కేసులు.. ఇవన్నీ ఇలా ఉండగానే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత అరెస్టు.. ఎన్ని ప్రయత్నాలు చేసినా దక్కని బెయిలు.. మరో 14 రోజులపాటు ఆమెకు రిమాండ్.. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య భారత రాష్ట్ర సమితి త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోబోతోంది. 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ.. ఈ సీట్లో కచ్చితంగా గెలుస్తామని ధైర్యంగా చెప్పలేని పరిస్థితి భారత రాష్ట్ర సమితి అధిష్టానానికి ఉంది. అనుకూల మీడియాలో ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అంతటి సానుకూల పవనాలు వీయడం లేదు. గతంలో అధికారంలో ఉన్నప్పుడే పెద్దపెట్టున పార్లమెంటు స్థానాలు భారత రాష్ట్ర సమితి గెలుచుకోలేకపోయింది. అలాంటిది ఇప్పుడు అధికారంలో లేదు.. పైగా గత పరిపాలనకు సంబంధించిన వైఫల్యాలు కళ్ళముందు కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు భారత రాష్ట్ర సమితి ఏ విధంగా పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొంటుందనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న.

బాధ్యత గల ప్రతిపక్షంగా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ విషయంలో భారత రాష్ట్ర సమితిని అభినందించాల్సిందే. కానీ వరుసగా వైఫల్యాలు ఎదురవుతున్నప్పటికీ ఆ పార్టీ నాయకులు గుణపాఠాలు నేర్చుకున్నట్టు కనిపించడం లేదు. కష్టకాలంలోనూ అనైక్యతనే ప్రదర్శిస్తున్నారు. గతంలో భారత రాష్ట్ర సమితిలో ఇలాంటి సంఘటనలు ఒకటి లేదా రెండు జరిగేవి. ఆ తర్వాత అవి సర్దుకునేవి. అధికారాన్ని కోల్పోయిన తర్వాత భారత రాష్ట్ర సమితిలోనూ అంతర్గత స్వేచ్ఛ ఎక్కువైనట్టుంది. పైగా కేసీఆర్ కూడా సరిగ్గా పట్టించుకోకపోవడంతో నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు..

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ లోక్ సభ స్థానానికి సంబంధించి మంగళవారం భారత రాష్ట్ర సమితి కార్యాలయం తెలంగాణ భవన్ లో సమావేశ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. ఆయన హాజరయ్యే కంటే ముందు భారత రాష్ట్ర సమితి నాయకులు మాట్లాడారు. అయితే ఈ వేదిక మీద భారత రాష్ట్ర సమితి నాయకుల మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, భారత రాష్ట్ర సమితి నాయకుడు రావుల శ్రీధర్ రెడ్డి మధ్య గొడవ జరిగింది. మాగంటి గోపీనాథ్ మాట్లాడుతుండగా శ్రీధర్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో శ్రీధర్ రెడ్డి పై మాగంటి గోపీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదిక మీదే ఆ ఇద్దరు నాయకులు తిట్టుకున్నారు. దీంతో ఆ సమావేశానికి వచ్చిన కార్యకర్తలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇక వేదిక పక్కనే ఉన్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆ ఇద్దరు నాయకులకు సర్ది చెప్పారు. అనంతరం కేటీఆర్ వచ్చిన తర్వాత సమావేశం జరిగింది. ఆ సమావేశంలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం లేదని, వాళ్లలో వాళ్లే కొట్టుకుంటున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించడం విశేషం. మరి ఈ వివాదం కేసీఆర్ దాకా వెళ్ళిందా? ఒకవేళ వెళ్తే దీనిని ఎలా పరిష్కరిస్తారు? ఈ ప్రశ్నలకు ప్రస్తుతం సమాధానం లభించాల్సి ఉంది.