
మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ నాలుగు అంతస్తుల నివాస భవనం కుప్పకూలింది. ఉల్లాస్ నగర్ పట్టణంలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో 11 మందిన పోలీసులు రక్షించారు. ఇంకా ఐదుగురు వాటికిందే ఉన్నట్లు భావిస్తున్నారు. వీరిని రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. క్యాంపు నెంబర్ 1 ప్రాంతంలోని బహుళ అంతస్తుల భవనం మధ్యాహ్నం ఒంటిగంటా 40 నిమిషాల సమయంలో కుప్పకూలడంతో చాలామంది శిథిలాల కింద చిక్కుకున్నారని థానే మున్సిపల్ కార్పొరేషన్ విపత్తు నిర్వహణ విభాగం ముఖ్య అధికారి సంతోశ్ కదం తెలిపారు.