
హుజూరాబాద్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ గా పరిస్థితులు ఏర్పడ్డాయి. పల్లా గురువారం హుజురాబాద్ లో పర్యటించారు. బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఈటల రాజేందర్ కూడా హుజూరాబాద్ లో పర్యటించారు. ఈ క్రమంలో హుజూరాబాద్ లోని కాట్రపల్లి వద్ద ఈటల- పల్లా రాజేశ్వర్ వాహనాలు ఎదురెదురుగా వచ్చాయి. దీంతో కాట్రాపల్లి వద్ద పల్లాను చూసిన ఈటల అనుచరులు, బీజేపీ కార్యకర్తలు జై ఈటల జైజై ఈటల జై బీజేపీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. మరో వైపు పల్లా వాహనంలో ఉన్న కార్యకర్తలు కూడా జై టీఆర్ఎస్ అంటూ పోటీగా నినాదాలు చేశారు. ఇలా ఇరుపార్టీల నినాదాలతో కాట్రపల్లిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.