Tamil Nadu elections: తమిళనాడులో తమిళులే ఉంటారనుకొంటాం. ఎందుకంటే పేరు లోనే తమిళనాడు ఉంది కాబట్టి.. మన అంచనా అలా ఉండడం తప్పులేదు. కానీ తమిళనాడు కేవలం తమిళ ప్రజలకు మాత్రమే సొంతం కాదు. భిన్నత్వంలో ఏకత్వం లాగా అక్కడ సంస్కృతి కనిపిస్తూ ఉంటుంది. పైగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతం కాబట్టి దేశంలోని విభిన్న రాష్ట్రాలకు చెందినవారు అక్కడ నివాసం ఉంటారు. దీంతో కేవలం తమిళం మాత్రమే కాకుండా.. గుజరాతి, రాజస్థానీ, బెంగాలీ, తెలుగు ప్రజలు కూడా అక్కడ ఉంటారు.
ప్రస్తుతం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు అక్కడి అధికార డిఎంకెకు, ప్రతిపక్ష అన్న డీఎంకేకు, కొత్తగా వచ్చిన టీవీ కేకు అత్యంత ముఖ్యం. అందుకే ఈ ఎన్నికలను అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? సంకీర్ణ ప్రభుత్వం సాధ్యమవుతుందా? అనే ప్రశ్నలను పక్కన పెడితే.. తమిళనాడు రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా తెలుగు ప్రజల దయా దాక్షిణ్యాలు కచ్చితంగా కావాలి.
2011 లెక్కల ప్రకారం తమిళనాడు జనాభాలో 33.4% అంటే మొత్తం 5.6 కోట్ల ఓటర్లలో 1.4 కోట్ల మంది తెలుగువాళ్లే. ఈ ప్రకారం ప్రతి ముగ్గురిలో ఒకరు తెలుగు వ్యక్తి ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలుగువారు ఎటువైపు నిలుస్తే.. ఆ పార్టీ నే అధికారాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. అందువల్లే అధికార డిఎంకె పార్టీ 17 మందిని.. ప్రతిపక్ష అన్నా డీఎంకే 22 మంది అభ్యర్థులను రంగంలోకి దింపాయి. తమిళనాడు రాష్ట్రంలో మొత్తం 234 సీట్లు ఉన్నాయి. ఈనెల 23న ఇక్కడి అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ ఎన్నికలను అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించాయి. అన్ని పార్టీలు ఓటర్ల మీద వరాల జల్లు కురిపించాయి. ఈ నేపథ్యంలో తెలుగు ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపిస్తారు.. ఎవరిని గెలిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
కొంతకాలంగా తెలుగు ప్రజలు ఇక్కడ ప్రభుత్వాలను కొన్ని కోరికలు కోరుతున్నాయి. ముఖ్యంగా తెలుగును గుర్తించాలని.. తెలుగు మాధ్యమంలో పాఠాలు బోధించేలా చేయాలని.. తమిళం తర్వాత స్థాయిలో గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నారు. తెలుగు పాఠశాలలను కొనసాగించాలని.. తెలుగు అధ్యాపకుల మీద ఒత్తిడి తీసుకురావద్దని కోరుతున్నారు. ఈ ఎన్నికల్లో ఈ సమస్యలను పరిష్కరిస్తామని అన్ని పార్టీలు తెలుగు వాళ్ళకు హామీ ఇచ్చాయి. ఆ హామీలు నెరవేర్చిన పార్టీకి ఓటు వేస్తామని తెలుగు వాళ్ళు చెబుతున్నారు. కేత ఎన్నికల్లో డిఎంకె పార్టీకి తెలుగు వాళ్ళు సపోర్ట్ చేశారు. అయితే ఈసారి తెలుగు వాళ్ళ సపోర్టు డీఎంకే లేదా అన్నా డీఎంకే కాకుండా టీవీకే విజయ్ వైపు ఎక్కువగా ఉందని తెలుస్తోంది.